భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల భద్రత కోసం నిరంతరం 10 శాటిలైట్లు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.
ప్రజలు ధైర్యంగా ఉండాలి
ఈ ఉపగ్రహాలు 24 గంటలు, 7 రోజులు (24/7) నిర్విరామంగా పనిచేస్తూ ఉంటాయని, కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండాలని నారాయణన్ అన్నారు. దేశంలో పూర్తి భద్రత కోసం ఈ శాటిలైట్లను వివిధ దశల్లో నింగిలోకి పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇంఫాల్‌లో ఇస్రో చైర్మన్ వ్యాఖ్యలు
మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (CAU) 5వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్రో చైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉపగ్రహాలు, డ్రోన్ల ప్రాముఖ్యత
"10 ఉపగ్రహాలు దేశ భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రజలు ధైర్యంగా ఉండాలి. మన సరిహద్దు దేశాల గురించి మనకు తెలుసు. మన దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే శాటిలైట్ల ద్వారానే సాధ్యం. భారతదేశంలో 7,000 కిలో మీటర్ల సముద్ర తీరం, ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాలి. ఉపగ్రహాలు, డ్రోన్ టెక్నాలజీ లేకుండా దేశ భద్రత సాధ్యం కాదు" అని వి. నారాయణన్ స్పష్టం చేశారు.
వాయిదా పడిన భారత్-పాక్ చర్చలు
మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరగాల్సిన మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య చర్చలు సాయంత్రం 5 గంటలకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ చర్చల్లో పీఓకేను తమకు అప్పగించాలన్న ప్రధాన డిమాండ్‌ను భారత్ తెరపైకి తీసుకురానుంది.