బెంగళూరులో భాషా వివాదం: టెక్ కంపెనీ తరలింపు, పుణెకు మారనున్న కార్యాలయం

 


ఐటీ రంగంలో దేశ రాజధానిగా వెలుగొందుతున్న బెంగళూరులో భాషా వివాదాలు తరచుగా ప్రజ్వరిల్లుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి వేర్వేరు భాషలు మాట్లాడేవారు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది వారికి స్థానికుల నుంచి భాషాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో, బెంగళూరుకు చెందిన ఓ టెక్ ఫౌండర్ తన కంపెనీ కార్యాలయాన్ని పుణెకు తరలించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎంట్రప్రెన్యూర్‌ కౌశిక్ ముఖర్జీ, ఇటీవల రాజుకున్న భాషా వివాదంపై 'ఎక్స్' వేదికగా స్పందించారు. భాషా సమస్యల వల్ల కన్నడ మాట్లాడలేని తమ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే బెంగళూరు కార్యాలయాన్ని పుణెకు తరలించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగుల ఆందోళనలు, వారి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖర్జీ తెలిపారు.

"బెంగళూరులోని మా కార్యాలయాన్ని ఆరు నెలల్లో మూసేసి పుణెకు తరలించాలని ఈ రోజే నిర్ణయించుకున్నాను. భాషా వివాదాలు ఇలాగే కొనసాగితే కన్నడ మాట్లాడలేని మా ఉద్యోగులు అన్యాయానికి గురవడం నాకు ఇష్టం లేదు. ఇది ఉద్యోగుల ఆందోళనల నుంచి వచ్చిన ఆలోచన, వారి అభిప్రాయాలను నేను సమర్థిస్తాను" అని కౌశిక్ ముఖర్జీ పేర్కొన్నారు.

ఈ నిర్ణయానికి తాజా కారణం చందాపురలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో జరిగిన ఓ ఘటన. అక్కడి మేనేజర్ కన్నడలో మాట్లాడటానికి నిరాకరించడంతో మేనేజర్, కస్టమర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో కన్నడ సంఘాలు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వీడియోను షేర్ చేస్తూ మేనేజర్ ప్రవర్తనను ఖండించగా, దానికి స్పందనగా కౌశిక్ ముఖర్జీ ఈ పోస్ట్‌ను చేశారు.