మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనతో హైదరాబాద్‌లోని శిల్పారామం సందడిగా మారింది. శిల్పారామానికి చేరుకున్న ప్రపంచ అందగత్తెలకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక వాహనాల్లో శిల్పారామంలో చక్కర్లు కొట్టారు. శిల్పారామంలోని స్టాల్స్‌ను సందర్శించి, వివిధ రకాల ఉత్పత్తులను గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా, బతుకమ్మ ఆడి వారు ఎంతో ఉత్సాహంగా సందడి చేశారు. శిల్పారామం పర్యటన తర్వాత, సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు.
మిస్ వరల్డ్ పోటీలు ఉత్కంఠ భరితంగా
ప్రస్తుతం, మిస్ వరల్డ్ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. టీ-హబ్‌లో నిర్వహించిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో నాలుగు ఖండాల నుంచి 24 మంది విజేతలుగా నిలిచారు. ఈ టాప్ 24లో మిస్ ఇండియా నందిని గుప్తా చోటు దక్కించుకున్నారు. అమెరికన్, కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఏషియా, ఓసియానా ఖండాల వారీగా తదుపరి రౌండ్‌లకు విజేతలను ఎంపిక చేయనున్నారు. ఖండాల వారీగా టాప్‌లో నిలిచిన వారికి ఈ నెల 31న జరిగే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలో చోటు లభించనుంది.

