అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని పెంటకోట బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.
ఘటన వివరాలు
పాయకరావుపేట ఎస్సీ కాలనీలో నివసించే కంపల చెల్లారావు ఇంట్లో ఇటీవల ఒక శుభకార్యం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన బంధువులు హాజరయ్యారు. ఆ కుటుంబానికి చెందిన యువకుడు అభిలాష్, హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. ఈ శుభకార్యానికి అభిలాష్ కూడా హాజరయ్యాడు. అందరూ కలిసి సరదాగా గడిపిన తర్వాత, పాయకరావుపేటకు సమీపంలోని పెంటకోట బీచ్‌కు వెళ్లారు.
కొంతమంది బీచ్ ఒడ్డున ఉండగా, మరికొంతమంది నీటిలో స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భారీ కెరటం పిల్లి అభిలాష్‌ను అమాంతంగా లోపలికి లాగేసింది. ఇది గమనించి అతన్ని కాపాడేందుకు వెళ్లిన గంపల హరీష్ అనే మరో యువకుడు కూడా సముద్రపు కెరటాల్లో కొట్టుకుపోయాడు.
గాలింపు చర్యలు, మృతదేహాల లభ్యం
అది గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో, సమీపంలోని మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు అక్కడికి చేరుకొని సముద్రంలో గల్లంతైన వారి కోసం గాలించారు. మొదట వారి జాడ కనిపించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటన హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే జరగడంతో ఆమెకు విషయం తెలిసింది. వెంటనే సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
కొద్దిసేపటికే, బీచ్ సమీపంలోని ఉప్పుటేరులో రెండు మృతదేహాలు కొట్టుకువచ్చినట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా, అక్కడ అభిలాష్, హరీష్‌ల మృతదేహాలు కనిపించాయి. తమ బిడ్డల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అంది వచ్చిన ఇద్దరు యువకులు కెరటాలకు బలవడంతో ఆ రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.