జోలా బ్యాగ్‌కు విదేశాల్లో లగ్జరీ రేట్! అమెరికాలో రూ. 4,200లకు అమ్ముడవుతున్న భారతీయ చీప్ బ్యాగ్

jola bag

మన దేశంలో సాధారణంగా మనం తక్కువ ధరతో కొనేసే జోలా బ్యాగ్ ఇప్పుడు అంతర్జాతీయంగా లగ్జరీ బ్రాండ్‌గా మారుతోంది. రోజువారీ కిరాణా సరుకులు తీసుకెళ్లేందుకు, ప్రయాణాల్లో ఉపయోపడే సాధారణ జోలా బ్యాగ్‌ అమెరికాలో మాత్రం ఓ వింత ధరకు విక్రయమవుతోంది. ఈ బ్యాగ్‌ను మన మార్కెట్లలో రూ.50 నుంచి రూ.100 మధ్యలో సులభంగా కొనుగోలు చేయవచ్చు. అయితే అమెరికాలో ఉన్న ప్రముఖ లగ్జరీ రిటైల్ వెబ్‌సైట్ నార్డ్‌స్ట్రోమ్లో మాత్రం అదే బ్యాగ్ ఏకంగా 48 డాలర్లు, అంటే దాదాపు రూ.4,228కి అమ్ముడవుతోంది!

సోషల్ మీడియాలో వైరల్

ఈ విషయం మొదట చూసినవారికి నమ్మలేనిది అనిపించినా, ఇది నిజమే. సోషల్ మీడియాలో నార్డ్‌స్ట్రోమ్‌లో ఈ జోలా బ్యాగ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్లు వైరల్ అవుతున్నాయి.

నార్డ్‌స్ట్రోమ్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ బ్యాగ్‌ను జపాన్‌కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ ప్యూబ్కో (PUbco) రూపొందించింది. అయితే పేరు మాత్రం "ఇండియన్ సావనీర్ బ్యాగ్" అని మార్చింది.

"స్టైలిష్ బ్యాగ్" గా నార్డ్‌స్ట్రోమ్ వర్ణన

నార్డ్‌స్ట్రోమ్ ఈ జోలా బ్యాగ్‌ను "స్టైలిష్ బ్యాగ్, ప్రత్యేకమైన డిజైన్లతో అలంకరించబడింది" అని వర్ణించింది. చేతితో తయారు చేసిన డిజైన్‌ను కూడా హైలైట్ చేసింది. అదే సమయంలో రంగులు మసకబారడం మరియు ముద్రణ లోపాల గురించి హెచ్చరించింది. డిజైన్ విషయానికొస్తే, ప్రాథమిక తెల్లటి కాటన్ బ్యాగ్‌లో "రమేష్ స్పెషల్ నామ్‌కీన్" మరియు "చేతక్ స్వీట్స్" వంటి హిందీ టెక్స్ట్ ఉంది.

"ఇది మీ నిత్యావసర వస్తువులను తీసుకెళ్లడానికి, అలాగే భారతీయ సంస్కృతిపై మీ ప్రేమను ప్రదర్శించడానికి సరైన బ్యాగ్." అంతేకాదు, భారతీయ సంస్కృతిని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరి ఉత్పత్తిగా పేర్కొంది.

ఈ విషయం సామాన్య భారతీయుడిని ఆశ్చర్యపరిచేలా ఉన్నా, ఒక మూలలో ఇది మన సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. కానీ, అదే సమయంలో సాధారణ వస్తువులపై విదేశీ మార్కెట్లలో అదుపు తప్పిన ధరలు ఎలా పెరుగుతున్నాయో కూడా ఇది స్పష్టంగా చూపిస్తుంది.