తాజాగా, ఉక్రెయిన్ 100కు పైగా డ్రోన్లతో మాస్కోలోని డజనుకు పైగా ప్రాంతాలపై దాడి చేసింది. అయితే, అనేక డ్రోన్లను తాము సమర్థవంతంగా కూల్చివేశామని రష్యా ప్రకటించింది. డ్రోన్ దాడుల కారణంగా మాస్కో సమీపంలోని నాలుగు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ దాడుల వల్ల మాస్కోలోని ప్రధాన ప్రాంతాలతో పాటు మరో తొమ్మిది ప్రాంతీయ విమానాశ్రయాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని, దీనివల్ల వాటిని మూసివేయాల్సి వచ్చిందని రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాట్సియా వెల్లడించింది.
ఖార్కివ్‌పై రష్యా డ్రోన్ల దాడి, పౌరులకు గాయాలు
మరోవైపు, రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై రష్యా దళాలు 20కి పైగా డ్రోన్లను ప్రయోగించాయి. ఈ దాడిలో నలుగురు గాయపడగా, దాదాపు 100 మార్కెట్ స్టాళ్లు ధ్వంసమయ్యాయి. మరో ప్రాంతంలో రష్యా బాంబుల దాడిలో ఏడుగురు పౌరులు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
'విక్టరీ డే' సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణ
రెండో ప్రపంచ యుద్ధ విజయం యొక్క 80వ వార్షికోత్సవం సందర్భంగా, మే 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు ఉక్రెయిన్‌పై పోరును విరమించాలని రష్యా ప్రకటించింది. వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమై శాంతి ఒప్పందం గురించి చర్చలు జరిపిన తర్వాత మాస్కో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నేతలు హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 'విక్టరీ డే'కి ముఖ్య అతిథి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల పేర్కొన్నారు.
0 కామెంట్‌లు