మన తెలుగు వంటకాల్లో తొక్కులకు (ఊరగాయలకు) ప్రత్యేక స్థానం ఉంది. ఏ కూరతో భోజనం చేసినా, మొదటి ముద్ద తొక్కులతో తినడం చాలామందికి అలవాటు. అయితే, నిల్వ ఉంచే తొక్కులు ఆరోగ్యానికి మంచివి కావని చాలామంది వాదిస్తున్నా, వాటిలో అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా, పుల్లపుల్లగా, కారం కారంగా ఉండే నిమ్మకాయ తొక్కు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ నిమ్మకాయ తొక్కు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
రక్త ప్రసరణ మెరుగుదల
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలి. రక్త ప్రవాహంలో హెచ్చుతగ్గులు రక్తపోటుకు కారణమవుతాయి. రోజూ నిమ్మకాయ తొక్కుతో తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఇది రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి తోడు
నిమ్మకాయ తొక్కులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా, ఇందులో కొవ్వు అసలు ఉండదు. ఇది హృద్రోగాలు (గుండె జబ్బులు) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, దీన్ని నిరభ్యంతరంగా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
ఎముకల బలం కోసం
నిమ్మకాయలో కాపర్, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఎముకల ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. కాబట్టి, కాల్షియం, విటమిన్ ఎ, సి, పొటాషియం కలిగిన నిమ్మకాయ తొక్కును ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
రోగ నిరోధక శక్తి పెంపు
సప్లిమెంట్ల ద్వారా విటమిన్లు, పోషకాలను తీసుకోవడానికి బదులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాంటి ఆహారాల్లో నిమ్మకాయ తొక్కు ఒకటి. ఇందులో బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
జీర్ణక్రియ మెరుగుదల & బరువు నియంత్రణ
నిమ్మకాయ తొక్కు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. నిమ్మలో ఉండే ఎంజైములు శరీరంలోని విషతుల్యాలను (టాక్సిన్స్) తొలగించడంలో సహాయపడతాయి. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు.