Metabolic Syndrome | మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఇది మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం?

naveen
By -
0

 

Metabolic Syndrome

నగరీకరణ, వృత్తి ఉద్యోగాల స్వభావంలో మార్పులు, రాత్రి షిఫ్టులు, తగ్గిన శారీరక శ్రమ, మరియు మారిన ఆహారపు అలవాట్లు... ఇవన్నీ కలిసి మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పూర్వం ఇంట్లో తిని బయట కాలకృత్యాలు తీర్చుకునేవారు. ఇప్పుడేమో బయట తిని వచ్చి ఇంట్లో ఖాళీ చేసుకుంటున్నారు. మొత్తంగా, మనిషి తప్పుల సముదాయానికి ఒక పేరు పెట్టాలంటే, అదే ‘మెటబాలిక్ సిండ్రోమ్’.

మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగేందుకు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ముఖ్య అవయవాలు నిరంతరం పనిచేస్తుంటాయి. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి అంశాలు ఈ అవయవాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహంతోపాటు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ (జీఐ) వ్యాధులు పెరుగుతున్నాయి. ఇవన్నీ చివరికి ‘మెటబాలిక్ సిండ్రోమ్’గా మారి ప్రాణాలను హరిస్తున్నాయి. దీనివల్ల రానున్న ఐదేళ్లలో టైప్-2 డయాబెటిస్ ఐదు రెట్లు, గుండె జబ్బులు రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కొన్ని వ్యాధుల సమూహం. అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం, గుండె సమస్యలు... ఇలా ఒక వ్యాధుల సమూహం ఉన్నవారంతా మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టే. మెటబాలిజం అంటే జీవక్రియ. జీవులలో జరిగే జీవరసాయన చర్యలన్నిటినీ కలిపి ‘జీవక్రియ’ అంటాం. నేటి తరం ప్రజలలో జీవక్రియ సజావుగా సాగకపోవడం సాధారణమైపోయింది. ఇది మనం స్వయంగా సృష్టించుకున్న సమస్యే. ఆధునిక కాలంలో కంటినిండా నిద్ర ఉండటం లేదు, సరైన ఆహారం తీసుకోవడం లేదు, డెస్క్ ఉద్యోగాల కారణంగా శారీరక శ్రమ దూరం అవుతున్నది. ఘాటైన మసాలాలపై మక్కువ, పోషకాహారం పట్ల నిర్లక్ష్యం వంటి అలవాట్లు రోగాలను తెచ్చి పెడుతున్నాయి. ఒక వ్యాధి మరొక వ్యాధికి, ఆ వ్యాధి ఇంకో వ్యాధికి కారణమవుతూ... చివరికి ‘మెటబాలిక్ సిండ్రోమ్’కు దారితీస్తున్నది.

అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య నిర్వచనం ప్రకారం... ఊబకాయంతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ (LDL), అధిక ట్రైగ్లిజరైడ్ల స్థాయి తదితర సమస్యలలో ఏ రెండు ఉన్నా మెటబాలిక్ సిండ్రోమ్ ఉచ్చులో చిక్కుకున్నట్టే. ఇదో గొలుసుకట్టు వ్యవహారం. ఊబకాయానికి మధుమేహం తోడవుతుంది. మధుమేహానికి గుండె సమస్యలు జత చేరుతాయి. వీటితో ఏ మూత్రపిండ సమస్సో చేయి కలపవచ్చు, లేదంటే పక్షవాతం మీద పడవచ్చు. కాబట్టి ఊబకాయం, హృద్రోగ సమస్యలు, పక్షవాత లక్షణాలు... ప్రాథమిక స్థాయిలో కనిపించగానే మేలుకోవాలి. తగిన చికిత్స చేయించుకోవాలి.

మెటబాలిక్ సిండ్రోమ్‌ను గుర్తించడం ఎలా?

ఒకేసారి రెండు లేదా మూడు రకాల వ్యాధులు బయటపడటం అనేది శరీరంలో ప్రమాద ఘంటిక మోగుతున్న సూచనగా భావించాలి. అయితే, ప్రారంభ దశలోనే వాటిని గుర్తించి నియంత్రించడంలో అవకాశం తప్పకుండా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు లేదా కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నవారు, అలాగే హృద్రోగులతో పాటు ఫ్యాటీ లివర్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), పిత్తాశయ రాళ్లు (గాల్‌స్టోన్స్), నిద్రలో శ్వాసకు సంబంధించిన సమస్య (స్లీప్ అప్నియా) కలిగినవారు మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఆకలి ఎక్కువవడం, తరచూ మూత్ర విసర్జన అవసరపడటం, అకస్మాత్తుగా బరువు పెరగడం వంటి లక్షణాలు మెటబాలిక్ సమస్యలకు తొలి సంకేతాలుగా భావించాలి.

పిల్లల్లోనూ పెరుగుతున్న ప్రమాదం

ఈ సమస్య చిన్నపిల్లల్లోనూ కనిపించే అవకాశముందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అందువల్ల, చిన్నారుల ఆరోగ్యంలో ఏ చిన్న తేడా కనిపించినా అలసత్వం చూపకూడదు. వారికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుతనం అలవాటు చేయడం అత్యంత అవసరం. మంచి జీవనశైలి వారిలో ఎన్నో సమస్యలను ముందుగానే అడ్డుకోవడంలో సహాయపడుతుంది.

గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు బీజంగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ (LDL) అధికమవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె పనితీరును దెబ్బతీస్తుంది. అంతేకాదు, కాలేయంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడుతుంది. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం మెటబాలిక్ వ్యాధుల రిస్కును మరింత పెంచుతుంది.

మన శరీరానికి కొన్ని రుగ్మతలను తానే స్వయంగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అయితే, ఆరోగ్య సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరింత మంచిది. ఈ సిండ్రోమ్‌కు ప్రధానంగా కారణమయ్యే అధిక బరువును తగ్గించడం మనం తీసుకునే తొలి నిర్ణయం కావాలి. మితాహారం, పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య దిశగా మొదటి అడుగులు వేయవచ్చు.

చిరుతిండ్ల వల్ల, ఆకలి లేకపోయినా ఆబగా తినేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, ఈ క్షణం నుంచే ఆహార నియంత్రణపై దృష్టి పెట్టాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించకపోతే వైద్య నిపుణుల సహాయం తప్పనిసరి. బరువును తగ్గించేందుకు పలు రకాల సర్జరీలూ అందుబాటులో ఉన్నాయి. అధిక బరువును వదిలించుకోవడం వల్ల గుండె, జీర్ణకోశ, కాలేయ, రక్త సంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఆరోగ్యకరమైన స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ముందుజాగ్రత్త చర్యలు

మెటబాలిక్ సిండ్రోమ్‌ను నివారించడానికి లేదా నియంత్రించడానికి ఈ క్రింది ముందుజాగ్రత్త చర్యలు పాటించాలి:

  • బరువు పెరగకుండా చూసుకోవడం.
  • రోజూ వ్యాయామం చేయడం.
  • నూనె పదార్థాలు, మసాలాలు తగ్గించడం.
  • మానసిక ఆందోళనలకు దూరంగా ఉండటం.
  • ధూమపానం, మద్యపానం వదిలిపెట్టడం.

బీపీ, మధుమేహం, గుండె సమస్యలు ఉంటే వైద్యుల సూచన ప్రకారం మందులు వాడటం.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!