ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ రంగంలో ఓ భారీ ముందడుగు వేస్తోంది. ప్రముఖ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft), రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ స్థాపనకు శ్రీకారం చుట్టింది. అమరావతి కేంద్రంగా రూ. 1,772.08 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించడం సంచలనంగా మారింది.
అమరావతిలో మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్
ఈ పెట్టుబడిలో భాగంగా, మైక్రోసాఫ్ట్ సంస్థ 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ'లో అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనుంది.
ఇది ఏకంగా 1,200 క్యూబిట్ సామర్థ్యంతో (50 లాజికల్ క్యూబిట్స్) ఉండనుంది. క్వాంటం వ్యాలీ భవనానికి ఆనుకుని 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రత్యేక సౌకర్యాన్ని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) 50 ఎకరాలను కేటాయించింది.
ఏపీ లక్ష్యం: 'సిలికాన్ వ్యాలీ' తరహా వ్యవస్థ
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 'అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్’ను కూడా ఇప్పటికే రూపొందించింది.
ప్రాజెక్ట్ లక్ష్యాలు.. టైమ్‌లైన్
జనవరి 1, 2029 నాటికి ఈ రంగంలో 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,300 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం.
అంతేకాదు, అమరావతిని దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీగా మార్చి, సిలికాన్ వ్యాలీ తరహాలో ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
క్యూ కడుతున్న టెక్ దిగ్గజాలు
మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, ఇతర టెక్నాలజీ దిగ్గజాలు కూడా ఈ క్వాంటం వ్యాలీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి.
IBM, TCS, L&T భాగస్వామ్యం
ఇప్పటికే ఐబీఎం (IBM) సంస్థ 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
దేశంలోనే తొలి ఫుల్ స్టాక్ క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ కోసం IBM సంస్థ.. TCS, L&T లతో కూడా అవగాహన ఒప్పందాలు చేసుకోవడం విశేషం. ఇటీవల జరిగిన వర్క్‌షాప్‌లో IBM తన తాజా 156-క్విట్ హోరాన్ ప్రాసెసర్‌ను ఇక్కడ ప్రదర్శించింది.
రంగంలోకి జపాన్ సంస్థ 'ఫుజిట్సు'
జపాన్‌కు చెందిన ఫుజిట్సు (Fujitsu) కూడా 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపింది. దీంతో పాటు రీసెర్చ్ & డెవలప్‌మెంట్ కింద ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.
భవిష్యత్ అంతా క్వాంటమ్‌దే..
ప్రభుత్వ ప్రకటన ప్రకారం, క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ జనవరి 1, 2026 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దశలవారీగా ఇక్కడ 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఐక్యరాజ్యసమితి ఇప్పటికే 2025ను 'అంతర్జాతీయ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా' ప్రకటించింది.
క్వాంటం అనేది 'గేమ్-ఛేంజింగ్' టెక్నాలజీ అని, 2030 నాటికి ఇది ఊహించని వేగంతో అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి దిగ్గజాల రాకతో, అమరావతి ఇప్పుడు గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ మ్యాప్‌లో కీలక కేంద్రంగా మారనుంది.
