చంద్రబాబు సీరియస్.. 100% ఆన్‌లైన్!

naveen
By -
0

 

chandrababu naidu

ఇకపై 100% సేవలు ఆన్‌లైన్‌లోనే.. అధికారులకు సీఎం చంద్రబాబు డెడ్‌లైన్

అమరావతి: "అంతా ఆన్‌లైన్ అవుతుంటే ఇంకా ప్రజల్ని కార్యాలయాలకు రమ్మని పిలవడం ఏంటి? ఏ శాఖలోనూ అలాంటి పరిస్థితి ఉండకూడదు" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. ఇకపై రాష్ట్రంలో 100% ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్, వాట్సాప్, యాప్‌ల ద్వారానే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.


‘డేటా ఆధారిత పాలన’పై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సదస్సులో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో హాజరయ్యారు.


పాలనలో జవాబుదారీతనం ఉండాలి

‘డేటా ఆధారిత పాలన అమలుకు మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులే బాధ్యత తీసుకోవాలి. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఫలితాలు చూపాల్సింది మీరే’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘డేటా అనేది సంపద. సరిగా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చు. వసతిగృహాల్లో తాగునీరు బాగాలేక డయేరియా వచ్చింది. మంత్రులు, అధికారులు ఎందుకు రియల్‌ టైమ్‌లో పర్యవేక్షించలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. కార్యదర్శులు కార్యాలయాల్లో కూర్చునే విధానం వీడి, క్షేత్రస్థాయికి వెళ్లాలని చురకలంటించారు. డిసెంబరు రెండోవారంలో జరిగే కలెక్టర్ల సదస్సులోపు అందరూ తమ సామర్థ్యం చూపాలని ఆదేశించారు.


సమస్యల పరిష్కారంపై అసంతృప్తి

'మీకోసం' అర్జీల పరిష్కారంపై కొన్ని శాఖలు శ్రద్ధ చూపడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 4,174 దరఖాస్తుల్లో సరిగా పరిష్కరించినవి 1,450 మాత్రమేనని, 1,600 పైగా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఉదహరించారు. రెవెన్యూ శాఖలో 22ఏ వంటి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో సంతృప్తి శాతం 70కి చేరినా, అవినీతి ఇంకా ఉందని, మున్సిపల్, విద్యుత్తు శాఖల సేవలు మరింత పెరగాలని సూచించారు.


ప్రమాదాలపై రియాక్టివ్ వద్దు.. ప్రోయాక్టివ్ ఉండండి

‘ఏదైనా ఘటన జరిగినప్పుడు స్పందిస్తున్నాం, తర్వాత వదిలేస్తున్నాం’ అని చంద్రబాబు అసంతృప్తి వెలిబుచ్చారు. ‘ఒక ఘటన జరిగాక దానిపై మేధోమథనం చేయాలి. సమగ్ర నిర్వహణ విధానాలు రూపొందించాలి. కర్నూలులో బస్సు దగ్ధమైంది. ఆ బస్సు రిజిస్ట్రేషన్ మరో రాష్ట్రానిది. ఆయా రాష్ట్రాల పర్యవేక్షణ లేదు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉంది’ అని అన్నారు.


‘శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దైవ దర్శనానికి వెళ్లినప్పుడు తొక్కిసలాట జరిగింది. క్రౌడ్ మేనేజ్‌మెంట్ బాధ్యత ఎవరిది? అక్కడి సీఐ, ఎస్సైలకు తెలియకుండా అదెలా జరిగింది? విశాఖలో బాణసంచా పేలుడు జరిగింది, మళ్లీ అమలాపురంలో రిపీట్ అయింది. ఘటన జరగకుండా నియంత్రించలేకపోతున్నాం. టెక్నాలజీ ఉపయోగించుకుంటే మనం మరచినా అది సహాయం చేస్తుంది’ అని సీఎం పేర్కొన్నారు.


డిజిలాకర్ తరహాలో రాష్ట్ర వ్యవస్థ

అవసరమైతే, కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ తరహాలోనే రాష్ట్రంలోనూ ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఆధార్‌తో ప్రజలు తమకు సంబంధించిన అన్ని పత్రాలూ చూసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ప్రజల సమాచారాన్ని కుటుంబం యూనిట్‌గా జియో ట్యాగింగ్‌ చేశామని, దీన్ని అన్ని శాఖలూ ఉపయోగించుకోవాలని ఆదేశించారు.



వైసీపీ ప్రభుత్వ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని, వ్యవస్థలో లోపాలను సరిదిద్దుకుని అందరం సమిష్టిగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సేవలు 100% ఆన్‌లైన్ కావాలన్న సీఎం ఆదేశాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది అవినీతిని తగ్గిస్తుందని మీరు భావిస్తున్నారా? కామెంట్లలో పంచుకోండి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!