"ఇంత మంచి చేస్తున్నాం.. ఈ విషయాలు జనాలకు తెలిస్తే ఇక వేరే పార్టీ వైపు చూడరు!" అని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్ల కోసం ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు ఆదివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, తమది 'పొలిటికల్ గవర్నెన్సు' అని, నేతలు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలని సూచించారు. ప్రతినెలా 1వ తేదీన ఎలాంటి ఆటంకం లేకుండా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని, ఇది దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ (DBT) కార్యక్రమమని ఆయన గుర్తుచేశారు.
రూ. 50 వేల కోట్లు.. పెన్షన్ల రికార్డ్!
గత 17 నెలలుగా తాను స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపిన చంద్రబాబు, లబ్ధిదారులకు అందుతున్న సాయం వివరాలను ఇలా వివరించారు:
వృద్ధులకు ఏటా రూ. 48 వేల ఆర్థిక సాయం.
డయాలసిస్ రోగులకు సంవత్సరానికి రూ. 1.20 లక్షలు.
పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ఏటా రూ. 1.80 లక్షలు.
ఇప్పటివరకు కేవలం పెన్షన్ల కోసమే రూ. 50,763 కోట్లు ఖర్చు చేశారు.
కార్యకర్తలకు పదవులు.. ఉగాదికి ఇళ్లు
పార్టీ కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం రాజకీయ కక్షతో నీరు-చెట్టు, ఉపాధి హామీ బిల్లులను నిలిపివేసిందని, ఇళ్ల నిధులను దారి మళ్లించిందని విమర్శించారు. ఆ తప్పులను సరిదిద్దుతూ, ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను పేదలకు అందిస్తామని ఆయన ప్రకటించారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల్లో వర్క్‌షాప్‌లు, 5న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లలో పార్టీ నేతలు చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.

