బిహార్‌లో నితీష్ కుమార్ సర్కారుకు వింత సమస్య వచ్చిపడింది. మహిళల కోసం వేసిన డబ్బులు మగవాళ్ల ఖాతాల్లో పడ్డాయి. తీరా ఆ డబ్బు వెనక్కి ఇవ్వమంటే.. "మేకలు కొన్నాం.. పండగ చేసుకున్నాం.. మా దగ్గర పైసా లేదు" అని వారు చేతులెత్తేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' కింద ఒక్కో మహిళకు రూ. 10 వేల చొప్పున 75 లక్షల మందికి ప్రభుత్వం నగదు జమ చేసింది. అయితే దర్బంగా జిల్లా అహియారి గ్రామంలో సాంకేతిక లోపం (Technical Glitch) కారణంగా ఈ డబ్బులు కొందరు పురుషుల ఖాతాల్లోకి వెళ్లాయి.
పండగ చేసుకున్నాం.. మేకలు కొన్నాం!
పొరపాటును గుర్తించిన అధికారులు, ఆ డబ్బును వెంటనే వెనక్కి ఇవ్వాలని ఆ పురుషులకు నోటీసులు పంపారు. దీనికి వారు ఇచ్చిన సమాధానాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఖర్చు అయిపోయింది: "దీపావళి, ఛట్ పూజలకు ఆ డబ్బును వాడేశాం. ఇప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ లేదు" అని కొందరు తెగేసి చెప్పారు.
మేకలు, బాతులు: మరికొందరు ఆ డబ్బుతో మేకలు, బాతులు కొనుక్కున్నామని, ఇప్పుడు వాటిని అమ్మలేమని, డబ్బు తిరిగి కట్టలేమని స్పష్టం చేశారు.
మా తప్పు లేదు.. మాఫీ చేయండి!
నాగేంద్ర రామ్, బలరామ్ సాహ్ని వంటి దివ్యాంగుల ఖాతాల్లోనూ ఈ డబ్బు పడింది. "మేము దరఖాస్తు చేసుకోలేదు. ప్రభుత్వమే మా ఖాతాలో వేసింది. ఆ డబ్బుతో పండగ చేసుకున్నాం. ఇప్పుడు తిరిగి కట్టమంటే ఎక్కడి నుంచి తెస్తాం? సీఎం నితీష్ కుమారే (Nitish Kumar) మాఫీ చేయాలి" అని వారు వేడుకుంటున్నారు.
ఈ వ్యవహారంపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శర్వణ్ కుమార్ స్పందించారు. ఇది ఆందోళనకరమైన విషయమని, నగదు బదిలీలో జరిగిన పొరపాటుపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

