తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దొరికింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
ఆ ఐదుగురికి క్లీన్ చిట్!
అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు.
ఎమ్మెల్యేల వాదన: తాము ఏ పార్టీ కండువా కప్పుకోలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని, తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారు.
స్పీకర్ సంతృప్తి: వారి వివరణతో సంతృప్తి చెందిన స్పీకర్.. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులను తిరస్కరించారు.
మిగతా వారి పరిస్థితి ఏంటి?
మొత్తం 10 మందిపై ఫిర్యాదులు రాగా.. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్‌పై స్పీకర్ త్వరలో నిర్ణయం ప్రకటించనున్నారు. ఇక కడియం శ్రీహరి, దానం నాగేందర్ మరింత సమయం కోరడంతో వారి అంశం పెండింగ్‌లో ఉంది.
సుప్రీంకోర్టులో తేలుతుందా?
రేపటితో సుప్రీంకోర్టు గడువు ముగియనుండటంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, బీఆర్ఎస్ మాత్రం తగ్గేదేలే అంటోంది. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎల్లుండి (డిసెంబర్ 19న) జరగబోయే విచారణలో తమ దగ్గరున్న ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతోంది.

