మార్కెట్లో ఆయిల్ నిల్వలు ఫుల్లుగా ఉన్నా.. ధరలు మాత్రం దిగిరావడం లేదు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆ ఒక్క పని, నల్ల సముద్రంలో జరిగిన ఆ దాడి.. ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌ను ఎలా భయపెడుతున్నాయో చూడండి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై (సరఫరా) మిగులు ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) బ్యారెల్ ధర 59 డాలర్ల పైన స్థిరంగా ఉండగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 63 డాలర్ల సమీపంలో కొనసాగుతోంది. వెనిజులాలో నెలకొన్న పరిస్థితులు, నల్ల సముద్రం (Black Sea)లో దెబ్బతిన్న ఎగుమతి టెర్మినల్ ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
వెనిజులాపై ట్రంప్ సీరియస్.. బ్లాక్ సీలో టెన్షన్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు గట్టి వార్నింగ్ ఇవ్వడం మార్కెట్లో అనిశ్చితిని పెంచింది. వెనిజులా ప్రాంతం సమీపంలో అమెరికా బలగాలు మోహరించడం, ట్రంప్ అత్యవసర సమావేశం నిర్వహించడం వంటి పరిణామాలు వ్యాపారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఆయిల్ సరఫరాపై తీవ్రంగా పడుతోంది. తాజా పరిణామాలు ఇలా ఉన్నాయి:
ఎనర్జీ కేంద్రాలపై దాడులు: ఉక్రెయిన్ దళాలు రష్యాకు చెందిన కీలక ఇంధన కేంద్రాలపై దాడులు చేశాయి.
ఎగుమతులకు బ్రేక్: కజకిస్థాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే ఒక కీలక టెర్మినల్ నల్ల సముద్రంలో దెబ్బతింది.
టెర్మినల్ బంద్: దెబ్బతిన్న టెర్మినల్ భాగాన్ని ఇకపై ఉపయోగించలేమని ఆపరేటర్లు చేతులెత్తేశారు, ఇది చమురు ఎగుమతులకు పెద్ద దెబ్బ.
సోమవారం సింగపూర్ మార్కెట్లో జనవరి డెలివరీ కోసం WTI బ్యారెల్ ధర 59.57 డాలర్లుగా, ఫిబ్రవరి డెలివరీ కోసం బ్రెంట్ క్రూడ్ 63.17 డాలర్లుగా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సర్-ప్లస్ (Surplus) ఉన్నా, ఈ యుద్ధ మేఘాలు, రాజకీయ గొడవలే ధరలను కిందకు దిగనివ్వడం లేదు.

