టెక్ దిగ్గజం ఆపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది! వెనుకబడిపోతున్నాం అనే భయంతోనో ఏమో.. తన 'ఏఐ' (AI) విభాగానికి కొత్త బాస్‌గా ఒక సీనియర్ భారతీయ నిపుణుడిని నియమించింది.
కృత్రిమ మేధస్సు (AI) రేసులో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలతో పోటీపడేందుకు ఆపిల్ (Apple) తన వ్యూహాన్ని మార్చుకుంది. తన ఏఐ బృందంలో భారీ మార్పులు చేస్తూ, అమర్ సుబ్రమణ్య (Amar Subramanya)ను కొత్త ఏఐ లీడర్‌గా నియమించింది. 2018 నుంచి ఈ బాధ్యతలు చూస్తున్న జాన్ జియానాండ్రియా వచ్చే సంవత్సరం మార్చి లో రిటైర్ కానున్నారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్ అనుభవంతో..
అమర్ సుబ్రమణ్య సాధారణ వ్యక్తి కాదు. ఆయన గతంలో మైక్రోసాఫ్ట్, గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMind) వంటి అగ్రశ్రేణి సంస్థల్లో పనిచేసిన అనుభవజ్ఞుడైన ఏఐ పరిశోధకుడు. ఇప్పుడు ఆపిల్‌లో 'వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐ'గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆయన ముందున్న సవాళ్లు ఇవే:
ఆపిల్ ఫౌండేషన్ మోడల్స్, ఏఐ భద్రతపై పనిచేసే బృందాలను నడిపించడం.
ఆలస్యమవుతున్న సిరి (Siri) అప్‌డేట్‌ను వేగవంతం చేయడం. (ఇది 2026కి వాయిదా పడింది).
పోటీదారులను తట్టుకుని 'ఆపిల్ ఇంటెలిజెన్స్'ను మెరుగుపరచడం.
ఆపిల్ రూట్ సెపరేట్!
ఆపిల్ షేర్లు ఈ ఏడాది పెరిగినా, ఏఐ ఖర్చు విషయంలో ఆపిల్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. పోటీదారులు క్లౌడ్ కంప్యూటింగ్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటే, ఆపిల్ మాత్రం ఫోన్లలోనే పనిచేసే 'ఆన్-డివైస్ ఏఐ' (On-device AI) పైనే దృష్టి పెట్టింది. ఇది ప్రైవసీకి మంచిదే అయినా, టెక్నాలజీ పరంగా పెద్ద సవాలు.
మాజీ ఆపిల్ డిజైనర్ జానీ ఐవ్ తన స్టార్టప్‌ను ఓపెన్‌ఏఐ (OpenAI)కి అమ్మేయడం వంటి పరిణామాలు భవిష్యత్తులో హార్డ్‌వేర్ మార్పులను సూచిస్తున్నాయి. రాబోయే కాలంలో మొబైల్ ఫోన్లు కాదు, ఏఐ మాత్రమే టెక్నాలజీని శాసిస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే, అమర్ సుబ్రమణ్య నియామకం ఆపిల్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది.

