బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దెబ్బకు బులియన్ మార్కెట్ రికార్డులను బద్దలు కొడుతోంది. మంగళవారం ఒక్కరోజే పసిడి, వెండి ధరలు భారీగా పెరిగి సరికొత్త ఆల్ టైమ్ గరిష్ఠాలను తాకాయి.
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 1.2 శాతం పెరిగి, 10 గ్రాములకు రూ. 1,38,381 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని (All-Time High) నమోదు చేశాయి.
వెండి రేటు.. రూ. 2.16 లక్షలు!
బంగారం కంటే వెండి మరింత వేగంగా పరుగులు పెడుతోంది. ఎంసీఎక్స్‌లో వెండి ధర 1.7 శాతం పెరిగి కిలోకు రూ. 2,16,596 వద్ద కొత్త రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం సమయానికి కూడా మార్కెట్ లాభాల్లోనే కొనసాగుతోంది.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణం.
అమెరికా - వెనిజువెలా ఉద్రిక్తతలు: వెనిజువెలా చమురును తరలిస్తున్న సూపర్ ట్యాంకర్‌ను అమెరికా కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకోవడం, నౌకలను అడ్డుకోవడం వంటి చర్యలతో యుద్ధ భయాలు పెరిగాయి.
రష్యా జనరల్ హత్య: బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్ చనిపోవడం కూడా భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తించింది.
డాలర్ పతనం: డాలర్ ఇండెక్స్ 0.20 శాతం తగ్గడంతో, ఇతర కరెన్సీల్లో బంగారం చౌకగా మారి డిమాండ్ పెరిగింది.
ఈ ఏడాది 140 శాతం లాభం!
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం కూడా ధరలకు రెక్కలు తెచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయంగా బంగారం ధరలు 76 శాతం పెరగ్గా, వెండి ధరలు ఏకంగా 140 శాతం పెరగడం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.

