ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భద్రత కోసం గూగుల్ (Google) అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆపదలో ఉన్నప్పుడు క్షణాల్లో లొకేషన్ పంపించే ‘ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్’ (ELS)ను మంగళవారం భారత్‌లో అధికారికంగా ప్రారంభించింది. ఈ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్న తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రికార్డు సృష్టించింది.
యూపీలో ఫస్ట్.. 112తో లింక్
గూగుల్ ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీని ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ తమ ‘112’ అత్యవసర సేవల హెల్ప్‌లైన్‌తో అనుసంధానించింది. ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి 112 నంబర్‌కు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా.. ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
ఫోన్‌లోని జీపీఎస్ (GPS), వై-ఫై, మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్‌ను వాడుకుని.. బాధితులు ఉన్న ప్రదేశాన్ని దాదాపు 50 మీటర్ల కచ్చితత్వంతో గుర్తిస్తుంది. ఇది సహాయక బృందాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఫోన్ కట్ అయినా లొకేషన్ వెళ్తుంది!
ఈ టెక్నాలజీలోని ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు కాల్ చేసిన వెంటనే కనెక్షన్ కట్ అయినా సరే.. ఈ ఫీచర్ పనిచేస్తుంది. కాల్ కనెక్ట్ అయిన ఆ కొద్ది క్షణాల్లోనే లొకేషన్ వివరాలు ఎమర్జెన్సీ కేంద్రానికి చేరిపోతాయి.
దీనివల్ల పోలీసులు లేదా అంబులెన్స్ సిబ్బంది సమయం వృథా కాకుండా సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంటుంది. యూపీలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినప్పుడు సుమారు 2 కోట్ల కాల్స్‌లో ఇది విజయవంతంగా పనిచేసింది.
ప్రైవసీకి ఢోకా లేదు.. యాప్ అవసరం లేదు
యూజర్ల వ్యక్తిగత భద్రత (Privacy) విషయంలో గూగుల్ స్పష్టత ఇచ్చింది. ఈ ఫీచర్ కేవలం ఎమర్జెన్సీ కాల్స్ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తుందని, ఆ డేటాను గూగుల్ సేకరించదని, స్టోర్ చేయదని తెలిపింది. లొకేషన్ వివరాలు నేరుగా ఎమర్జెన్సీ కేంద్రానికే వెళ్తాయి.
దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్ 6.0 లేదా ఆ తర్వాతి వెర్షన్ ఉన్న ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇది ఉచితంగా, అంతర్నిర్మితంగా (In-built) లభిస్తుంది.
టెక్నాలజీని మానవ రక్షణ కోసం వాడటంలో ఇదొక విప్లవాత్మక ముందడుగు. ఉత్తరప్రదేశ్ బాటలో త్వరలోనే మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ గూగుల్ ఎమర్జెన్సీ సర్వీసును తమ హెల్ప్‌లైన్లతో అనుసంధానించే అవకాశం ఉంది.

