క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ చూడని అద్భుతం జరిగింది! బౌలర్ల కలల రికార్డును ఇండోనేషియాకు చెందిన ఓ పేసర్ బద్దలు కొట్టాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 5 వికెట్లు తీసి, టీ20 చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
ఇండోనేషియా ఫాస్ట్ బౌలర్ గెడె ప్రియాందన (Gede Priandana) ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. బాలి వేదికగా కంబోడియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ సంచలనం నమోదైంది. ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఫీట్‌ను ప్రియాందన సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆ ఓవర్‌లో అసలేం జరిగింది?
మ్యాచ్ 16వ ఓవర్ వరకు కంబోడియా 5 వికెట్లకు 106 పరుగులతో నిలకడగా ఆడుతోంది. అప్పుడే బౌలింగ్‌కు వచ్చిన ప్రియాందన విధ్వంసం సృష్టించాడు.
హ్యాట్రిక్: ఓవర్ వేసిన తొలి మూడు బంతులకే 3 వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు.
మొత్తం 5 వికెట్లు: నాలుగో బంతి డాట్ కాగా.. ఆ తర్వాత ఒక వైడ్ పడింది. ఇక చివరి రెండు బంతులకు మరో రెండు వికెట్లు తీశాడు. దీంతో ఆ ఒక్క ఓవర్‌లోనే 5 వికెట్లు నేలకూలాయి. కంబోడియా 107 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇండోనేషియా 60 పరుగుల తేడాతో గెలిచింది.
మలింగ, రషీద్ ఖాన్ రికార్డులు బద్దలు!
గతంలో లసిత్ మలింగ, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ వంటి దిగ్గజ బౌలర్లు అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన రికార్డులు ఉన్నాయి. కానీ ఒకే ఓవర్‌లో 5 వికెట్లు తీయడం మాత్రం చరిత్రలో ఇదే తొలిసారి.
అంతకుముందు బ్యాటింగ్‌లో ఇండోనేషియా తరఫున ధర్మ కేసుమా అజేయ శతకం (110)తో రాణించగా, బౌలింగ్‌లో ప్రియాందన మ్యాజిక్‌తో ఆ జట్టు ఘన విజయం సాధించింది.

