ఉద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు ఇవ్వడం మనకు తెలుసు.. కానీ ఏకంగా కోటిన్నర విలువ చేసే ఇళ్లను గిఫ్ట్‌గా ఇచ్చే కంపెనీని ఎప్పుడైనా చూశారా? తన ఉద్యోగుల సొంతింటి కలను నిజం చేసిన ఓ ఆటోమోటివ్ కంపెనీ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
సాధారణంగా కంపెనీలు పండగలకు స్వీట్ బాక్సులో, చిన్నపాటి బోనస్సో ఇస్తుంటాయి. కానీ చైనాకు చెందిన ‘జెజియాంగ్ గుషెంగ్ ఆటోమోటివ్ టెక్నాలజీ’ (Zhejiang Guosheng Automotive Technology) మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. తన నమ్మకమైన ఉద్యోగులకు ఏకంగా రూ. 1.5 కోట్ల విలువైన ప్లాట్లను ఉచితంగా బహుమతిగా ఇస్తోంది. రాబోయే మూడేళ్లలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు 18 లగ్జరీ ఫ్లాట్లను అందజేయనున్నట్లు ప్రకటించింది.
చిన్న కంపెనీ కాదు.. భారీ టర్నోవర్!
ఇదేదో పబ్లిసిటీ కోసం చేసే చిన్న స్టార్టప్ కంపెనీ కాదు. ఆటోమోటివ్ విడిభాగాలు తయారు చేసే ఈ సంస్థలో 450 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024లో ఈ కంపెనీ దాదాపు 70 మిలియన్ డాలర్ల (భారీ మొత్తం) అవుట్‌పుట్ సాధించింది. లాభాలు రావడమే కాదు, వాటిని ఉద్యోగులతో పంచుకోవడంలోనూ ఈ సంస్థ ముందుంది.
వలస కార్మికుల కోసమే..
ఈ నిర్ణయం వెనుక ఓ బలమైన కారణం ఉంది. కంపెనీలో పనిచేసే వారిలో చాలామంది వలస కార్మికులే. వారికి సొంత ఇళ్లు లేక, ఫ్యాక్టరీకి దగ్గర్లో అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్ (Wang Jiayuan) గుర్తించారు. వారి కష్టాలను తీర్చేందుకే ఈ ఉచిత ఇళ్ల పథకానికి రూపకల్పన చేశారు.
ఆఫీసు పక్కనే లగ్జరీ ఇల్లు!
ఈ ఏడాది ఇప్పటికే 5 ప్లాట్లను ఉద్యోగులకు అందజేశారు. వచ్చే ఏడాది మరో 8, ఆ తర్వాత మిగిలినవి కలిపి మొత్తం 18 ప్లాట్లను పంపిణీ చేయనున్నారు.
దూరం: ఈ ప్లాట్లన్నీ ఆఫీసు నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. దీనివల్ల ఉద్యోగుల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
విస్తీర్ణం: ఒక్కో ప్లాట్ 100 నుంచి 150 చదరపు మీటర్ల (సుమారు 1076 - 1615 చదరపు అడుగులు) విస్తీర్ణంలో విశాలంగా ఉంటుంది.
ఉద్యోగుల సంక్షేమం అంటే కేవలం జీతాలు పెంచడం మాత్రమే కాదని ఈ చైనా కంపెనీ నిరూపించింది. వలస కార్మికుల సొంతింటి కల నెరవేర్చడం ద్వారా కార్పొరేట్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి బాస్ దొరకడం అక్కడి ఉద్యోగుల అదృష్టమనే చెప్పాలి.

