పదో తరగతి అనగానే విద్యార్థుల్లో తెలియని భయం, ఒత్తిడి మొదలవుతుంది. ఈ టెన్షన్‌ను పోగొట్టి, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా ఉన్నాయి.
యోగా, ధ్యానం మస్ట్..
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త టైమ్‌టేబుల్‌ను సూచించింది.
రిలాక్సేషన్: ఉదయం తరగతులు ప్రారంభానికి ముందు, అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత మొదటి పీరియడ్‌లో.. దాదాపు 10 నిమిషాల పాటు యోగా (Yoga), ధ్యానం చేయించాలి.
ఆటలు: సాయంత్రం స్కూల్ విడిచిపెట్టే ముందు చివరి పీరియడ్‌లో విద్యార్థులతో ఆటలు ఆడించాలి. అయితే ఇందులో ఎలాంటి పోటీతత్వం ఉండకూడదు. కేవలం వారిలో ఉత్సాహం నింపేలా ఉండాలి.
తిట్టకూడదు.. ధైర్యం చెప్పాలి!
చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల టీచర్లు, పేరెంట్స్ ఎలా ఉండాలో కూడా విద్యాశాఖ స్పష్టం చేసింది.
చదువు నెమ్మదిగా సాగించే పిల్లలను (Slow Learners) క్రమశిక్షణ పేరుతో బెదిరించకూడదు. వారికి లైఫ్ స్కిల్స్‌పై అవగాహన కల్పించాలి.
రోజూ అసెంబ్లీలో స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేయాలి. విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి స్కూళ్లలో ప్రత్యేకంగా 'హెల్ప్ బాక్సులు' (Help Boxes) ఏర్పాటు చేయాలి.
పేరెంట్స్ బాధ్యత ఇదే..
ప్రధానోపాధ్యాయులు, క్లాస్ టీచర్లు, పీఈటీలు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలి. అలాగే తల్లిదండ్రులకు కూడా కొన్ని సూచనలు చేశారు.
కౌన్సెలింగ్: పిల్లల వాస్తవ పరిస్థితిని తల్లిదండ్రులకు వివరించాలి. పరీక్షల సమయంలో పిల్లల స్క్రీన్ టైంను (టీవీ, ఫోన్) నియంత్రించేలా చూడాలి.
ఆహ్లాదం: స్కూల్ ఆవరణలో వాకింగ్, తోట పనులు చేయించడం వల్ల పిల్లలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్, పోలికల బెడద లేకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలి.

