ఫుట్‌బాల్ దేవుడు లియోనల్ మెస్సీని కళ్లారా చూసేందుకు హైదరాబాద్ రెడీ అయ్యింది! ఉప్పల్ స్టేడియం వేదికగా ఆయన మ్యాజిక్‌ను చూడబోతున్నాం. అయితే, ఈ సందడి కారణంగా వాహనదారులకు మాత్రం ట్రాఫిక్ కష్టాలు తప్పవు.
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi) మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో సందడి చేయనున్నారు. ఇవాళ సాయంత్రం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే భారీ చారిటీ మ్యాచ్‌లో ఆయన ఆడనున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు భారీ భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు ఉప్పల్ పరిసరాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఏ రూట్లలో వెళ్లకూడదు?
మీరు ఈ సమయంల ఉప్పల్ వైపు వెళ్లే ప్లాన్ ఉంటే మార్చుకోవడం బెటర్. పోలీసులు సూచించిన దారి మళ్లింపులు ఇవే:
తార్నాక వైపు నుంచి: తార్నాక నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలను హబ్సిగూడ క్రాస్ రోడ్స్ దగ్గరే ఆపేసి.. నాచారం, చర్లపల్లి వైపు మళ్లిస్తారు.
రామాంతపూర్ వైపు నుంచి: ఇటు నుంచి వచ్చే వాహనాలను స్ట్రీట్ నెం.8 వద్ద దారి మళ్లిస్తారు.
సలహా: ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ఉండాలంటే మెట్రో (Metro) లేదా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడం ఉత్తమం.
పార్కింగ్ ఎక్కడ?
మ్యాచ్ చూసేందుకు వచ్చే వారి కోసం స్టేడియం చుట్టూ కిలోమీటరు దూరంలోనే 10 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
హబ్సిగూడ నుంచి వచ్చేవారు: పెంగ్విన్ గ్రౌండ్, లిటిల్ ఫ్లవర్ కాలేజ్, మున్సిపల్ గ్రౌండ్స్‌లో పార్క్ చేయాలి.
ఎల్బీ నగర్/రామాంతపూర్ నుంచి వచ్చేవారు: జైన్ పార్కింగ్, శాండ్ అడ్డా, ఈనాడు ఆఫీస్ వద్ద పార్కింగ్ చేసుకోవచ్చు.
విఐపీలు: పాసులు ఉన్న వాహనాలను మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తారు. పాసులు లేని వాహనాలను ఏక్ మినార్, ఎల్జీ గోడౌన్ చెక్‌పోస్టుల వద్దే ఆపేస్తారు.
ఇక లారీలు, వాటర్ ట్యాంకర్ల వంటి భారీ వాహనాలకు మధ్యాహ్నం 12 గంటల నుంచే ఎంట్రీ లేదు. వాటిని ఓఆర్ఆర్ (ORR) మీదుగా మళ్లిస్తున్నారు. నగరవాసులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

