శ్రీకాకుళం జిల్లాలోని ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? వరుసగా జనం అస్వస్థతకు గురవడంతో సాక్షాత్తూ సీఎం చంద్రబాబే రంగంలోకి దిగి ఆరా తీశారు!
శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా (Diarrhea) కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. గ్రామంలోని తాజా పరిస్థితిని, తీసుకుంటున్న చర్యలను వైద్యారోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం రాత్రి నుంచి ఇప్పటివరకు సుమారు 9 మంది అస్వస్థతకు గురై టెక్కలి ఆసుపత్రిలో చేరారని, వారిలో ప్రస్తుతం ఐదుగురు చికిత్స పొందుతున్నారని అధికారులు వివరించారు.
వృద్ధుడి మృతిపై క్లారిటీ
చికిత్స పొందుతూ చిన్నారావు (70) అనే వృద్ధుడు మృతి చెందడం ఆందోళన కలిగించింది. అయితే, ఆయన మరణానికి డయేరియా కారణం కాదని అధికారులు సీఎంకు స్పష్టం చేశారు. చిన్నారావు గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, మల్టీ ఆర్గాన్ డిస్-ఫంక్షన్ కారణంగా గుండెపోటు వచ్చి మరణించారని వైద్యులు నిర్ధారించారు.
అసలు నీటిలో ఏముంది? అధికారుల నివేదిక ఇదీ..
గ్రామంలో నీటి సరఫరా, ప్రస్తుత పరిస్థితిపై అధికారులు సీఎంకు కీలక నివేదిక అందించారు:
గ్రామానికి నీరందించే బావి, 2 చేతి పంపుల నీటిని ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా పరీక్షించగా, ఎక్కడా కలుషితం లేదని తేలింది.
నీరు తాగడానికి సురక్షితమే అయినా, ముందు జాగ్రత్తగా బావి నీటిని ఆపేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
డయేరియాకు అసలు కారణం ఏంటో తెలుసుకునేందుకు ఎపిడెమియాలజిస్ట్, వైద్య బృందాలు గ్రామంలోనే ఉండి ఇంటింటికీ సర్వే చేస్తున్నారు.
నీరు సురక్షితమే అయితే ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో తక్షణమే గుర్తించాలని సీఎం ఆదేశించారు. కేవలం తాళ్లవలస మాత్రమే కాకుండా, సమీప గ్రామాలపైనా దృష్టి సారించి అందరికీ సురక్షితమైన మంచినీరు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.

