షేక్ హసీనాకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు! ఇప్పటికే దేశం విడిచి పారిపోయిన ఆ మాజీ ప్రధానికి.. ఇప్పుడు స్వదేశంలోని కోర్టు మరో షాకింగ్ తీర్పు ఇచ్చింది.
భూ కుంభకోణం కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని స్పెషల్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. కేవలం హసీనాకే కాదు, ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, బ్రిటన్ ఎంపీగా ఉన్న ఆమె మేనకోడలు తులిప్ సిద్ధిక్‌కు కూడా రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం తీర్పు వెలువరించారు. అవినీతి నిరోధక కమిషన్ (ACC) వేసిన కేసుల్లో హసీనాకు వ్యతిరేకంగా వచ్చిన నాలుగో తీర్పు ఇది కావడం గమనార్హం.
అసలు ఈ కుంభకోణం ఏంటంటే:
అక్రమ కేటాయింపు: పుర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్ట్‌లోని అత్యంత ఖరీదైన దౌత్య మండలంలో (Diplomatic Zone) నిబంధనలకు విరుద్ధంగా 6 ప్లాట్లను వీరు స్వాధీనం చేసుకున్నారు.
కుటుంబం కోసం: హసీనా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అనర్హులైన తన కొడుకు సజీబ్ వాజెద్ జాయ్, కూతురు సైమా వాజెద్ పుతుల్‌కు ఈ భూములను కట్టబెట్టారు.
గైర్హాజరీలో తీర్పు: హసీనా ప్రస్తుతం దేశంలో లేకపోవడంతో, ఆమె గైర్హాజరీలోనే న్యాయమూర్తి ఈ శిక్షలను ఖరారు చేశారు.
మొత్తం 21 ఏళ్ల శిక్ష!
ఇంతకుముందే నవంబర్ 27న, మూడు వేర్వేరు ప్లాట్ స్కామ్ కేసుల్లో హసీనాకు ఒక్కోదానికి ఏడేళ్ల చొప్పున మొత్తం 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇదే కేసుల్లో ఆమె పిల్లలైన జాయ్, పుతుల్‌లకు కూడా ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష పడింది. మరోవైపు, జూలై 2024లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినందుకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఆమెకు మరణశిక్ష విధించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

