దుబాయ్ వేదికగా భారత కుర్రాడు విశ్వరూపం చూపించాడు. బౌండరీల మోత, సిక్సర్ల వర్షంతో యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.
దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. యూఏఈతో జరుగుతున్న పోరులో ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్.. కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులు చేసి ఔరా అనిపించాడు. టీ20ని మించిన వేగంతో ఆడిన వైభవ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 భారీ సిక్సర్లు, 9 ఫోర్లు ఉండటం విశేషం.
టాస్ వాళ్లది.. ఆట మనోడిది!
దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ ఆ నిర్ణయం ఎంత తప్పో వైభవ్ నిరూపించాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన వైభవ్.. మొదటి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
కప్ కొట్టాల్సిందే..
గతేడాది ఇదే వేదికపై ఫైనల్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన భారత జట్టు, ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా వంటి టాలెంటెడ్ ప్లేయర్స్ జట్టులో ఉన్నారు. టోర్నీ ఆరంభంలోనే వైభవ్ ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపయింది.

