క్రికెట్ రికార్డులే కాదు.. గూగుల్ సెర్చ్ రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు. ఏకంగా విరాట్ కోహ్లీనే వెనక్కి నెట్టి.. ఇంటర్నెట్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఇండియన్‌గా మారాడు!
భారత క్రికెట్‌లో బీహార్‌కు చెందిన 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. మైదానంలో పరుగుల వరద పారిస్తున్న ఈ కుర్రాడు.. ఇంటర్నెట్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. 2025లో గూగుల్‌లో అత్యధికంగా వెతకబడిన భారతీయుడిగా (Most Searched Indian) నిలిచి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా అధిగమించడం విశేషం.
95 బంతుల్లో 171.. రికార్డుల మోత!
తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో వైభవ్ విశ్వరూపం చూపించాడు. శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
సిక్సర్ల వర్షం: అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. అండర్-19 ఆసియా కప్ చరిత్రలో ఒక భారతీయ ప్లేయర్‌కు ఇదే అత్యధిక స్కోరు.
రెండో స్థానం: యూత్ వన్డేల్లో భారత్ తరఫున ఇది రెండో అత్యధిక స్కోరు. 2002లో అంబటి రాయుడు (177) చేసిన రికార్డు తర్వాత ఇదే బెస్ట్.
కోహ్లీని దాటేశావ్.. ఏమంటావ్?
మ్యాచ్ తర్వాత "కోహ్లీ కంటే ఎక్కువ మంది నిన్ను గూగుల్‌లో వెతుకుతున్నారు, ఈ హైప్ ఎలా అనిపిస్తోంది?" అని అడిగిన ప్రశ్నకు వైభవ్ చాలా వినమ్రంగా సమాధానమిచ్చాడు.
"నేను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోను. నా దృష్టి అంతా నా ఆటను మెరుగుపరుచుకోవడంపైనే ఉంటుంది. ఇలాంటి వార్తలు విన్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. కాసేపు ఆనందిస్తా, ఆ తర్వాత మళ్లీ నా పనిలో నేను నిమగ్నమవుతాను. అంతే" అని వైభవ్ తెలిపాడు. చిన్న వయసులోనే అతనికి ఉన్న పరిణితి చూసి దిగ్గజాలు సైతం ప్రశంసిస్తున్నారు.

