అమెరికా వెళ్లాలనుకునే టెక్కీలకు, ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఈ నిర్ణయంపై ఇప్పుడు అమెరికాలోని రాష్ట్రాలే భగ్గుమంటున్నాయి.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఓ సంచలన నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. కొత్తగా హెచ్-1బీ (H-1B) వీసా పిటిషన్లపై ఏకంగా 1,00,000 డాలర్ల (లక్ష డాలర్లు) ఫీజు విధించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా 20 రాష్ట్రాలు కోర్టు మెట్లెక్కాయి. ఇది చట్టవిరుద్ధమని, ప్రజా సేవలకు విఘాతం కలిగిస్తుందని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగాయి.
ఆసుపత్రులు, బడులు మూతపడాల్సిందేనా?
ట్రంప్ జారీ చేసిన ఆదేశాల మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ కొత్త ఫీజును తెరపైకి తెచ్చింది. దీనివల్ల కలిగే అనర్థాలను రాష్ట్రాలు కోర్టుకు వివరించాయి:
- ఆర్థిక భారం: ఈ అక్రమ ఫీజు వల్ల ఆసుపత్రులు, యూనివర్సిటీలు, ప్రభుత్వ పాఠశాలలు కుదేలవుతాయని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా వాదించారు.
- భారీ పెంపు: ప్రస్తుతం 960 నుంచి 7,595 డాలర్ల మధ్య ఉన్న ఫీజును, ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
భారతీయులకూ గుబులు..
ఇప్పటికే అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. 2036 నాటికి 86,000 మంది డాక్టర్ల కొరత రావచ్చని అంచనా. ఇలాంటి సమయంలో ఈ ఫీజు నిర్ణయం వల్ల ఖాళీలను భర్తీ చేయడం అసాధ్యంగా మారుతుంది. ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లే టెక్ నిపుణులు, వైద్యులకు హెచ్-1బీ వీసానే ప్రధాన మార్గం కాబట్టి.. ఈ పరిణామం మనవాళ్లను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

