వయసు మీద పడుతోందని విమర్శించే వాళ్లకు తన బ్యాట్‌తోనే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు! సెంచరీ కొట్టాక కోహ్లీ చెప్పిన ఆ ఒక్క మాట.. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్.
తనపై, తన భవిష్యత్‌పై వస్తున్న ఎన్నో ఊహాగానాలకు, విమర్శలకు విరాట్ కోహ్లీ ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు. ఫార్మాట్ ఏదైనా, వయసు ఎంతైనా తన క్లాస్ ఎప్పటికీ మారనిదని మరోసారి నిరూపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత తొలి వన్డేలో 120 బంతుల్లోనే 135 పరుగులు చేసి విశ్వరూపం చూపించాడు. కింగ్ కోహ్లీ ప్రదర్శనతో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.
టెస్టుల్లోకి రీఎంట్రీ? కోహ్లీ క్లారిటీ ఇదే..
గత కొద్దిరోజులుగా బీసీసీఐ కోహ్లీ, రోహిత్‌లను మళ్లీ టెస్టులు ఆడమని కోరుతున్నట్లు వార్తలు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు తీసుకుంటూ కోహ్లీ తన భవిష్యత్ ప్లాన్‌పై స్పష్టత ఇచ్చాడు.
కోహ్లీ చెప్పిన కీలక విషయాలు ఇవే:
"నేను ఏ ఫార్మాట్ ఆడినా నా 120 శాతం ఎఫర్ట్ పెడతాను."
"నా సన్నద్ధతపై నాకు పూర్తి నమ్మకం ఉంది."
"ప్రస్తుతానికి నా దృష్టి కేవలం వన్డే ఫార్మాట్‌పైనే ఉంది. టెస్టుల గురించి ఆలోచించడం లేదు."
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (18) రూపంలో ఎదురుదెబ్బ తగిలినా, కోహ్లీ మాత్రం తగ్గలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (60), రోహిత్ శర్మ (57)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 37 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా క్రీజులో కదలాడుతూ, దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికారేసి తన టెస్టు పునరాగమనం పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.

