ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే దిశగా అతిపెద్ద ముందడుగు పడింది. హైదరాబాద్‌పైనే ఆధారపడకుండా, ఉత్తర తెలంగాణ వాసులు సొంత గడ్డ మీద నుంచి విమానం ఎక్కే రోజులు దగ్గరపడ్డాయి. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు ఇక పరుగులు పెట్టనున్నాయి. దీనికి సంబంధించి అత్యంత కీలకమైన భూసేకరణ ఘట్టం విజయవంతంగా పూర్తయింది. శనివారం వరంగల్ జిల్లా యంత్రాంగం అధికారికంగా భూమిని భారత విమానయాన సంస్థకు అప్పగించడంతో మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.
మామునూరు విమానాశ్రయం కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గతంలో ఎయిర్‌పోర్ట్ పరిధిలో ఉన్న 696 ఎకరాలకు తోడు, తాజాగా రైతుల నుంచి సేకరించిన 253 ఎకరాల ప్రైవేటు భూమిని కలిపి మొత్తం సుమారు 950 ఎకరాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అప్పగించారు. ఇందుకోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు సుమారు రూ. 1.20 కోట్ల చొప్పున మొత్తం రూ. 295 కోట్లను పరిహారంగా చెల్లించింది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఆర్బిట్రేషన్ ద్వారా రైతుల అభ్యంతరాలను పరిష్కరించి, క్లియర్‌గా ఉన్న భూమిని కేంద్ర బృందానికి అప్పగించడం విశేషం.
విమానాశ్రయ నిర్మాణం విషయంలో ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయాన్ని ఎంత వేగంగా పూర్తి చేశారో, అదే స్పీడ్‌తో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయం తరహాలో పచ్చదనంతో, అత్యాధునిక హంగులతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. మొదట చిన్న విమానాలు (72 సీట్లు) నడిపేలా ప్లాన్ చేసినా, భవిష్యత్తులో పెద్ద విమానాలు దిగేలా రన్‌వేను విస్తరించనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల లోపు మరో విమానాశ్రయం ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు సాధించడంతో ఈ అడ్డంకి తొలగిపోయింది.
వరంగల్‌కు విమాన సౌకర్యం రావడం అంటే కేవలం ప్రయాణ సౌలభ్యం మాత్రమే కాదు, అదొక ఆర్థిక విప్లవం. వరంగల్ ఐటీ హబ్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులకు ఇది కొత్త ఊపిరి పోయనుంది. పారిశ్రామికవేత్తలు, విదేశీ బయ్యర్లు నేరుగా వరంగల్ వచ్చే అవకాశం ఉండటంతో పెట్టుబడులు వెల్లువెత్తే ఛాన్స్ ఉంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వయిస్తంభాల గుడి వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. దీనివల్ల స్థానికంగా హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్ రంగాలు పుంజుకుని యువతకు ఉపాధి లభిస్తుంది. 2026 జనవరిలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని, 2027 చివరి నాటికి తొలి విమానం గాల్లోకి ఎగురుతుందని అధికారులు చెబుతున్నారు.
బాటమ్ లైన్..
మామునూరు ఎయిర్‌పోర్ట్ అనేది వరంగల్ గతిని మార్చే గేమ్ ఛేంజర్ (Game Changer).
అభివృద్ధి అంతా రాజధానిలోనే కేంద్రీకృతం కాకుండా, ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడానికి ఇదొక గొప్ప అవకాశం. వరంగల్ ఇప్పుడు నిజమైన 'సెకండ్ క్యాపిటల్'గా ఎదిగే ఛాన్స్ వచ్చింది.
ఎయిర్‌పోర్ట్ వస్తుందంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అయితే, ఇది సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూడటం కూడా ప్రభుత్వ బాధ్యతే.
భూమి ఇచ్చారు సరే.. పనులు కూడా అదే వేగంతో జరగాలి. గతంలో చాలా ప్రాజెక్టులు శంకుస్థాపనలతోనే ఆగిపోయాయి. మామునూరు అలా కాకుండా 2027 కల్లా పూర్తి కావాలని కోరుకుందాం.

