రాజస్థాన్ రాయల్స్ స్టార్ సంజూ శాంసన్.. ఉన్నట్టుండి ఎల్లో జెర్సీలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? రవీంద్ర జడేజా లాంటి స్టార్‌ను వదులుకుని మరీ సంజూను ఎందుకు తెచ్చుకున్నారు? ఈ ప్రశ్నలకు సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. దీని వెనుక పెద్ద 'మాస్టర్ ప్లాన్' ఉందట.
ఐపీఎల్‌లో 12 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన సంజూ శాంసన్ (Sanju Samson) ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సొంతం. గత నెలలో జరిగిన ఈ సంచలన ట్రేడింగ్‌లో.. సీఎస్‌కే తమ స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు ఇచ్చేసి, బదులుగా రూ. 18 కోట్ల ఫీజుతో సంజూను తీసుకుంది.
ఓపెనింగ్ కోసమే కాదు.. ధోనీ తర్వాత అతడే!
ఈ ట్రేడింగ్ వెనుక అసలు ఉద్దేశాన్ని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బయటపెట్టారు.
ఓపెనింగ్ సమస్య: "మా ఓపెనింగ్ బ్యాటింగ్ ఇంకాస్త బలపడాల్సిన అవసరం ఉంది. దానికి సంజూనే సరైన ఎంపిక అని భావించాం."
ధోనీ వారసత్వం: "ధోనీ ఏదో ఒక సమయంలో జట్టు నుంచి తప్పుకుంటారు. ఆ తర్వాత జట్టును ఎవరు నడిపిస్తారనేది ముఖ్యం. సంజూ ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు. ఇది కేవలం రెండేళ్ల కోసం కాదు, రాబోయే ఆరేళ్ల వరకు జట్టును పునరుత్తేజపరచడానికి (Revitalize) వేసిన ప్లాన్" అని ఫ్లెమింగ్ వివరించారు.
44 ఏళ్ల ధోనీ.. 31 ఏళ్ల సంజూ..
ప్రస్తుతం ధోనీ వయసు 44 ఏళ్లు. ఆయన కెరీర్ చివరి దశలో ఉన్నారు. మరోవైపు సంజూ శాంసన్ వయసు 31 ఏళ్లు. ఫిట్‌నెస్ కాపాడుకుంటే అతను మరో ఐదారు సీజన్లు ఈజీగా ఆడగలడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత సీఎస్‌కే పగ్గాలు (Captaincy) సంజూ చేతికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే జడేజాను సైతం వదులుకోవడానికి సీఎస్‌కే వెనకాడలేదు.
సీనియర్లు కాదు.. ఈసారి కుర్రాళ్లపైనే ఫోకస్!
సాధారణంగా సీనియర్లను నమ్ముకునే చెన్నై.. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూటు మార్చింది. అబుదాబి వేదికగా జరిగిన వేలంలో యంగ్ టాలెంట్‌పై భారీగా ఇన్వెస్ట్ చేసింది.
యువ రక్తం: అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కార్తిక్ శర్మ (వికెట్ కీపర్), ప్రశాంత్ వీర్ (ఆల్‌రౌండర్) కోసం ఏకంగా రూ. 14.2 కోట్ల చొప్పున వెచ్చించింది.
బౌలర్లు: వీరితో పాటు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు మాట్ హెన్రీ, అకీల్ హుస్సేన్‌లను తీసుకుంది.

