Bhoot Bangla: ఫేక్ కలెక్షన్ల పై ప్రియదర్శన్ ఘాటు వ్యాఖ్యలు

naveen
By -
Senior director Priyadarshan speaking at an interview


Bhoot Bangla 2026: జనాభా కంటే ఆ సినిమాల కలెక్షన్లే ఎక్కువ.. బాక్సాఫీస్ ఫేక్ లెక్కలపై దర్శకుడు ప్రియదర్శన్ సెటైర్లు!


ఒకప్పుడు భారతీయ చలనచిత్ర రంగంలో సినిమా విజయాన్ని దాని కథ, కథనం, ప్రేక్షకుల ఆదరణను బట్టి డిసైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అంతా బాక్సాఫీస్ మయం అయిపోయింది. ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తే ఆ సినిమా అంత పెద్ద హిట్ అనే భ్రమలో ఇండస్ట్రీ ఉండిపోయింది. తాజాగా ఇదే విషయమై బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.


సినిమా బిజినెస్ గురించి ఆయన విశ్లేషిస్తూ ప్రస్తుత ట్రెండ్ పై సెటైర్లు వేశారు. ప్రస్తుతం ప్రతి సినిమా 'వంద కోట్ల క్లబ్' లో చేరుతోందని, దాని గురించి ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అందరి దృష్టి ఇప్పుడు కేవలం రూ. 500 కోట్లు లేదా రూ. 1000 కోట్ల క్లబ్ పైనే ఉందన్నారు. కొన్ని సినిమాల కలెక్షన్లు చూస్తుంటే అవి ఏకంగా మన దేశ జనాభా కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ల పై ఆయన పరోక్షంగా చురకలు అంటించారు. కథాబలం కంటే వసూళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని, బడ్జెట్ కంటే కంటెంట్‌నే తాను నమ్ముతానని ప్రియదర్శన్ స్పష్టం చేశారు.


ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన కథలను వెండితెరపైకి తీసుకువస్తారని, హాలీవుడ్ దర్శకులతో పోటీ పడే సత్తా మన స్థానిక కథలకు ఉందని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌తో కలిసి 'భూత్ బంగ్లా' అనే హారర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాబోయే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో వెనుకబడిన ప్రియదర్శన్, కంటెంట్ నమ్ముకుని తీస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొడతానని ఎంతో ధీమాగా ఉన్నారు.