Vaibhav Suryavanshi: వీడియో గేమ్‌లా బ్యాటింగ్.. ద్రవిడ్‌కే మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చిన 14 ఏళ్ల కుర్రాడు!
టీమిండియా క్రికెట్ సెన్సేషన్, పద్నాలుగేళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రీడా లోకంలో మారుమోగుతోంది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే ఈ కుర్రాడు, ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసిన ఈ యువ సంచలనం గురించి, తాజాగా ఢిల్లీలో జరిగిన 'బీసీసీఐ నామన్ అవార్డ్స్' కార్యక్రమంలో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్ అరంగేట్రానికి ముందు దిగ్గజ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో వైభవ్ జరిపిన సంభాషణను ఆయన గుర్తుచేసుకున్నాడు.
గత ఏడాది (2025) ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ, కేవలం 14 సంవత్సరాల 23 రోజుల వయసులోనే లక్నో సూపర్ జెయింట్స్ పై అరంగేట్రం చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ చారిత్రక మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వైభవ్‌ను ప్రత్యేకంగా తన గదికి పిలిపించుకున్నాడట.
ఈరోజు నీ గేమ్ ప్లాన్ ఏంటి బాబూ అని ద్రవిడ్ ఎంతో ఆసక్తిగా అడగగా, ఆ ప్రశ్నకు ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు ఇచ్చిన సమాధానం విని ద్రవిడ్‌తో సహా అక్కడున్న వాళ్లందరికీ మైండ్ బ్లాక్ అయిందని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు.
రాహుల్ ద్రవిడ్ అడిగిన ఆ ప్రశ్నకు వైభవ్ ఏమాత్రం తడుముకోకుండా చాలా సాదాసీదాగా బదులిచ్చాడట. సార్, నాకంటూ ఏం ప్రత్యేకమైన ప్లాన్స్ లేవు, నా నాచురల్ గేమ్ నేను ఆడతాను, ఒకవేళ మొదటి బంతే నా జోన్ లోకి వస్తే మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని గాల్లోకి పంపేస్తాను అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడట.
మైదానంలోకి దిగాక అక్షరాలా తను చెప్పినట్టే ఆడి చూపించాడని శాంసన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏమాత్రం భయం లేకుండా క్రీజులో వైభవ్ ఆడుతున్న విధానం చూస్తుంటే, ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తుందని సంజు శాంసన్ మురిసిపోయాడు.

