వైద్య చరిత్రలో, భారతీయ న్యాయ వ్యవస్థలో ఇదొక సంచలనాత్మక ఘట్టం. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే, ఒక నిండు ప్రాణాన్ని చట్టబద్ధంగా గాల్లో కలపడం.. కన్న పేగు తల్లడిల్లుతున్నా ఆ తల్లిదండ్రులే తమ బిడ్డకు కన్నీళ్లతో మరణ శాసనం రాయడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
అయితే, ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన గురించి ఒక సామాన్యుడిగా మీరెందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే.. బతికే హక్కు ఎంత ముఖ్యమో, దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలతో నరకం అనుభవించే బదులు గౌరవంగా కన్నుమూసే హక్కు కూడా పౌరుడికి అంతే అవసరమని ఈ తీర్పు దేశానికి చాటిచెప్పింది.
13 ఏళ్ల జీవచ్ఛవం.. కన్నీటి పోరాటం
ఘాజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా.. ఇంజనీరింగ్ చదువుతూ ఎన్నో కలలు కన్న ఆ యువకుడు, హాస్టల్ బాల్కనీ నుంచి కిందపడి 13 ఏళ్లుగా కోమాలో మంచానికే పరిమితమయ్యాడు. కొడుకును బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు, మొక్కని దేవుడు లేడు.
వైద్యపరంగా ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆ నరకాన్ని చూడలేకపోయారు. తమ బిడ్డకు కారుణ్య మరణం (పాసివ్ యూతనేషియా) ప్రసాదించి విముక్తి కల్పించాలని ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లెక్కారు.
సుప్రీం సంచలనం.. బరువెక్కిన హృదయాలు
ఎన్నో ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత.. మానవీయ కోణంలో వారి అభ్యర్థనను విన్న సర్వోన్నత న్యాయస్థానం మార్చి 11న కారుణ్య మరణానికి చారిత్రాత్మక అనుమతి ఇచ్చింది. దేశంలో చట్టబద్ధమైన తొలి కారుణ్య మరణ కేసుగా ఇది చరిత్రకెక్కింది.
సుప్రీం ఆదేశాలతో ఎయిమ్స్ వైద్యులు హరీష్‌కు క్రమంగా లైఫ్ సపోర్ట్ నిలిపివేస్తుండగా.. "ఇక వెళ్లాల్సిన సమయం వచ్చింది.. అందర్నీ క్షమించు" అంటూ కుటుంబ సభ్యులు తుది వీడ్కోలు పలికిన దృశ్యాలు యావత్ దేశాన్ని కంటతడి పెట్టించాయి. చివరకు మంగళవారం అతడు శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.
బతికే హక్కుతో పాటు.. మరణించే హక్కు
ఏ తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకోరు అని హరీష్ తండ్రి అశోక్ రాణా కన్నీరుమున్నీరయ్యారు. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ఒక మనిషి ప్రాణాన్ని యంత్రాలతో బంధించి నరకం చూపించడం కంటే.. గౌరవప్రదమైన మరణం ప్రసాదించడమే ఉత్తమమని ఈ ఘటన నిరూపించింది.
రాబోయే రోజుల్లో 'లివింగ్ విల్' (Living Will) గురించి భారతీయుల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడే ఎంతోమంది దౌర్భాగ్యులకు, వారి కుటుంబాలకు ఈ చారిత్రక తీర్పు ఒక శాశ్వత మార్గదర్శకంగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.
Also Read:
మతం మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీం సంచలన తీర్పు!మహిళల ప్రవేశంపై శబరిమల బోర్డు పవర్ఫుల్ ఆన్సర్.. ఆ ఆంక్షలు ఎందుకంటే?
భారత్ ఎవరి పక్షం? పశ్చిమాసియా సంక్షోభంపై మోదీ పవర్ఫుల్ ఆన్సర్!
Tamil Nadu Elections: ఎన్డీయే సీట్ల పంపకాలు ఖరారు
West Bengal Assembly Elections: : దీదీ కోటలో ప్రకంపనలు.. బెంగాల్ రణరంగంలోకి దూసుకొస్తున్న ఒవైసీ 'మూడో శక్తి'!

