తమిళనాడు ఎన్నికల్లో ఉచితాల సునామీ.. అన్నాడీఎంకే సంచలన హామీలు!

naveen
By -
Tamil Nadu Elections


పన్నులు కట్టేది మీరు.. ఆ పన్నుల డబ్బుతోనే ఉచితాలు పంచుతూ ఓట్లు అడిగేది నాయకులు! ఉచితాలు పేదల ఆకలి తీరుస్తాయా, లేక వారిని జీవితకాలం బానిసలుగా మారుస్తాయా? తమిళనాడు ఎన్నికల రణరంగంలో ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. నిన్నటి దాకా ఒక హామీ.. నేడు మరో సంచలనం. ఓటరును ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు ఆడుతున్న ఈ 'ఉచితాల వల'లో సామాన్యులు ఎందుకు పడకూడదో.. ఈ హామీల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయమిది.


ఫ్రిజ్‌లు, స్కూటీలు, క్యాష్.. అన్నాడీఎంకే భారీ స్కెచ్ 

తమిళనాట ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే తన ఎన్నికల బ్రహ్మాస్త్రాలను బయటకు తీసింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉచితంగా రిఫ్రిజిరేటర్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అంతేకాదు, మహిళలకు 'అమ్మ టూవీలర్ పథకం' కింద స్కూటీ కొనుగోలు కోసం పాతిక వేల రూపాయల సబ్సిడీ ఇస్తామని హామీల వర్షం కురిపించింది. దీనివల్ల ఏటా ఐదు లక్షల మంది లబ్ధి పొందుతారని ఆ పార్టీ స్పష్టం చేసింది.


మరోవైపు రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రెండు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. రేషన్ సరుకులతో పాటు ఉచితంగా పప్పు, వంట నూనె ఇస్తామని కూడా వాగ్దానం చేశారు. ఒక సగటు ఓటరును పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు ఇది అన్నాడీఎంకే వేసిన భారీ స్కెచ్.


మగవాళ్లకు కూడా ఫ్రీ బస్.. రంగంలోకి దళపతి విజయ్ 

మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అనేది పాత ట్రెండ్.. ఇప్పుడు ఏకంగా పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అన్నాడీఎంకే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓట్ల వేటలో ఎవరినీ వదలకుండా అందరికీ గాలం వేస్తున్నారు.


మరోవైపు, రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ పార్టీ 'టీవీకే' కూడా ఉచితాల రేసులో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ద్రావిడ రాజకీయాలకు దీటుగా కొత్త తరం ఓటర్లను ఆకర్షించేందుకు, బరిలోకి దిగుతూనే భారీ ఉచిత హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారు.


టీవీలు, మిక్సీల నుంచి.. నేటి స్కూటీల దాకా 

తమిళనాడు రాజకీయాలు అంటేనే ఉచితాలకు కేరాఫ్ అడ్రస్. 1967 నుంచి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలే అక్కడ చక్రం తిప్పుతున్నాయి. 1978లో ఎంజీఆర్ మధ్యాహ్న భోజనం, రేషన్ బియ్యం లాంటి ప్రాథమిక అవసరాలతో ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఆకలి తీర్చడానికి ఆ పథకాలు అవసరం.


కానీ కాలక్రమంలో ఇది ఓటు బ్యాంకు రాజకీయంగా మారిపోయింది. 2006లో డీఎంకే ఉచిత కలర్ టీవీలు ఇస్తే.. 2011లో జయలలిత ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ఏకంగా దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా తమిళనాడు ఒక ఉచితాల మోడల్‌గా మారిపోవడం గమనార్హం.


ఉచితాల ఊబిలో సామాన్యుడు

ఉచితాలు వినడానికి, తీసుకోవడానికి చాలా ఆనందంగా అనిపించవచ్చు. కానీ, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఆకాశం నుంచి ఊడిపడవు. రేపు మనం కొనే ఉప్పు, పప్పు, పెట్రోల్ మీద వేసే పన్నుల నుంచే ఈ ఉచితాలకు నిధులు మళ్లిస్తారు. ప్రజలకు ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా నిలబెట్టాల్సింది పోయి.. ఇలా తాత్కాలిక తాయిలాలతో ఓట్లు దండుకోవడం దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతుంది. ఓటరుగా మనం ఫ్రిజ్‌లు, మిక్సీలు చూసి మురిసిపోతామా.. లేక మన పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయకుడిని ఎన్నుకుంటామా అన్నదే ఇప్పుడు అసలైన సవాల్. ఉచితాల మత్తు నుంచి బయటపడి, అభివృద్ధిని ప్రశ్నించిన రోజే సామాన్యుడికి నిజమైన గెలుపు!