శబరిమలలో ఆంక్షలు వివక్ష కాదు, సంప్రదాయం! సుప్రీం ముందు టీడీబీ సంచలన వాదన..
శబరిమల కొండల మీద కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, సమానత్వ హక్కుల పోరాటానికి మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న మహా సంగ్రామంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వివాదంపై.. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) సుప్రీంకోర్టు గడప తొక్కింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం అనేది ఏమాత్రం లింగ వివక్ష కాదని, అది అనాదిగా వస్తున్న ఆలయ పవిత్ర సంప్రదాయంలో భాగమని అత్యున్నత న్యాయస్థానానికి బోర్డు తేల్చిచెప్పింది.
నైష్ఠిక బ్రహ్మచర్యమే శబరిమల ప్రాణం
దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా అయ్యప్ప స్వామి ఆలయాలు ఉండొచ్చు.. కానీ శబరిమలకు ఉన్న ఆ ప్రత్యేకత వేరు, ఆ పవిత్రత వేరు. అక్కడ కొలువైన స్వామివారు ‘నైష్ఠిక బ్రహ్మచారి’. ఆయన ఆధ్యాత్మిక శక్తికి మూలం ఆ కఠోరమైన తపస్సు, నిరుపమానమైన ఇంద్రియ నిగ్రహం, రాజీపడని బ్రహ్మచర్యమే అని దేవస్వం బోర్డు కోర్టులో బలంగా వాదించింది.
స్వామివారు ఆచరించే ఈ కఠినమైన బ్రహ్మచర్య వ్రతాన్ని.. ఆయన్ని దర్శించుకునే భక్తులు సైతం అంతే నిష్టగా పాటించాలన్నదే శబరిమల అసలు నియమం. అందుకే ఈ కఠిన నిబంధనల వెనుక ఒక నిర్దిష్ట వయసున్న (10-50 ఏళ్లు) మహిళల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయని, అంతే తప్ప పదేళ్ల లోపు బాలికలకు గానీ, యాభై ఏళ్లు దాటిన వృద్ధురాళ్లకు గానీ అయ్యప్ప దర్శన భాగ్యం లేదనడం అబద్ధమని బోర్డు స్పష్టం చేసింది.
కోర్టు ముందు అంతర్జాతీయ పరిశోధనలు
తమ వాదన కేవలం గుడ్డి నమ్మకం కాదని నిరూపించేందుకు టీడీబీ ఏకంగా అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది. 1987లో కెనడాలోని ఒట్టావా యూనివర్సిటీకి చెందిన రాధికా శేఖర్ సమర్పించిన థీసిస్‌ను, అలాగే 2003లో ‘రాయల్ ఆంత్రోపాలజికల్ ఇనిస్టిట్యూట్’ ప్రచురించిన అధ్యయనాలను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టుకు సమర్పించింది.
ఈ అంతర్జాతీయ పరిశోధనలు కూడా శబరిమలలో వయోపరిమితి అనేది పురాతన మతపరమైన ఆచారమేనని, అది సమానత్వ హక్కులను కాలరాసే చర్య కాదని నిర్ధారించాయని బోర్డు వాదించింది. ఒక వర్గాన్ని మతపరమైన శాఖగా గుర్తించడం అనేది కేవలం చట్టం మాత్రమే నిర్ణయించే అంశం కాదని.. వాస్తవాలను, డాక్యుమెంటరీ ఆధారాలను లోతుగా పరిశీలించిన తర్వాతే తీర్పు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.
న్యాయదేవత తీర్పు కోసం ఉత్కంఠ
ఒకవైపు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, మరోవైపు తరతరాలుగా వస్తున్న కోట్లాది మంది భక్తుల మత విశ్వాసాలు.. ఈ రెండింటి మధ్య నలుగుతున్న శబరిమల వివాదం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. దేవుని ముందు అందరూ సమానులే అనే ఆధునిక వాదన గెలుస్తుందా? లేక దేవుని ఆచారాలకు, సంప్రదాయాలకు తలవంచాల్సిందే అనే విశ్వాసం నెగ్గుతుందా? న్యాయదేవత త్రాసులో ఇప్పుడు బరువు దేనివైపు మొగ్గుతుందో తేలాలంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు వేచి చూడక తప్పదు!
Also Read:
భారత్ ఎవరి పక్షం? పశ్చిమాసియా సంక్షోభంపై మోదీ పవర్‌ఫుల్ ఆన్సర్!Tamil Nadu Elections: ఎన్డీయే సీట్ల పంపకాలు ఖరారు
West Bengal Assembly Elections: : దీదీ కోటలో ప్రకంపనలు.. బెంగాల్ రణరంగంలోకి దూసుకొస్తున్న ఒవైసీ 'మూడో శక్తి'!
మండుతున్న పశ్చిమాసియా.. దేశ ఇంధన భద్రతపై ప్రధాని మోదీ వార్ రూమ్ భేటీ!
Commercial Gas Crisis : హోటల్స్, దాబాలకు కేంద్రం సంజీవని.. 20 శాతం అదనపు గ్యాస్ కేటాయింపు

