T20 World Cup 2026: 'విజయాల కంటే పరాజయాలే ఎక్కువ చూశా'.. వరల్డ్ కప్ గెలుపుపై సంజు శాంసన్ భావోద్వేగం!
టీమిండియా స్టార్ క్రికెటర్, 2026 టీ20 ప్రపంచకప్ హీరో సంజు శాంసన్ తన కెరీర్, లక్ష్యాల గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించడం తన చిన్ననాటి కల అని, ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ఏళ్లుగా అహర్నిశలు శ్రమించానని పంచుకున్నాడు. తన వరల్డ్ కప్ లక్ష్యాన్ని ప్రతిరోజూ ఊహించుకుంటూ ధ్యానం (Meditation) చేసేవాడినని సంజు వెల్లడించాడు. ఈ అద్భుత ప్రయాణంలో తనకు ఎదురైన అడ్డంకులు, వైఫల్యాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
రోహిత్ శర్మ అడిగిన ఆ ప్రశ్న..
తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకుంటూ సంజు పలు విషయాలు పంచుకున్నాడు. "2019లో ఐదు సంవత్సరాల సుదీర్ఘ గ్యాప్ తర్వాత నేను తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాను. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ నాతో ఒక మాట అన్నాడు. 'జట్టులోకి వచ్చాక నీ అసలు లక్ష్యం ఏంటి?' అని అడిగాడు. అప్పుడు నేను ఎలాంటి సందేహం లేకుండా.. 'భారత్‌కు వరల్డ్ కప్ అందించడమే నా టార్గెట్' అని బదులిచ్చా. అప్పటి నుంచి 2026 వరకూ అదే లక్ష్యంతో తీవ్రంగా కృషి చేశా" అని సంజు వివరించాడు.
వైఫల్యాలే నన్ను దృఢంగా మార్చాయి
"నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, వైఫల్యాలు ఎదురయ్యాయి. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు కింద పడిపోయాను. నిజం చెప్పాలంటే, నా కెరీర్‌లో విజయాల కంటే పరాజయాలనే ఎక్కువగా చూశాను. అందుకే వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అదే ఇప్పుడు నా అతిపెద్ద బలం" అని సంజు ధీమాగా చెప్పాడు.
2026 వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విఫలమైనప్పుడు తాను మానసికంగా బాగా కుంగిపోయానని, కానీ తనలో ఉన్న పట్టుదలే కేవలం నాలుగు ఐదు రోజుల్లోనే తిరిగి లేచి నిలబడేలా చేసిందని అన్నాడు. "చివరకు భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించాలనే నా కల నెరవేరింది. నా జీవితంలో చివరి శ్వాస వరకు ఈ క్షణం నాకు గుర్తుంటుంది" అని సంజు భావోద్వేగానికి గురయ్యాడు.
'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా సత్తా..
ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కష్టానికి తగిన ప్రతిఫలం 2026 టీ20 ప్రపంచకప్‌లో సంజుకు దక్కింది. ఈ టోర్నీలో ఆడిన కేవలం 5 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 3 అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గానూ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' (Player of the Series) అవార్డును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు.

