Vaibhav Suryavanshi: క్రిస్ గేల్ రికార్డే నా టార్గెట్.. దడ పుట్టిస్తున్న 14 ఏళ్ల కుర్రాడి కాన్ఫిడెన్స్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిన్న (మార్చి 15న) న్యూఢిల్లీలో అట్టహాసంగా నిర్వహించిన ‘నమన్ అవార్డుల’ వేడుక ఎన్నో ఆసక్తికర ఘట్టాలకు వేదికైంది. టీమిండియా స్టార్స్ సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ లాంటి సీనియర్లతో కలిసి వేదికను పంచుకున్న 14 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, తన ఫ్యూచర్ ప్లాన్స్‌ను ఓపెన్‌గా బయటపెట్టి క్రీడా లోకాన్ని ఆశ్చర్యపరిచాడు.
క్రిస్ గేల్ రికార్డుపైనే కన్నేసిన వండర్ కిడ్
ఈ వేడుకలో ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే వైభవ్‌ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "ఐపీఎల్‌లో నీవు బద్దలు కొట్టాలనుకుంటున్న అతిపెద్ద రికార్డు ఏది?" అని అడగ్గా.. బీహార్‌కు చెందిన ఈ యువ సంచలనం ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చాడు.
"యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ నెలకొల్పిన 175 నాటౌట్ రికార్డును బద్దలు కొట్టడమే నా ఏకైక లక్ష్యం" అని తన ఆత్మవిశ్వాసాన్ని చాటాడు. 2013లో పూణే వారియర్స్‌పై గేల్ కేవలం 66 బంతుల్లోనే ఈ చారిత్రాత్మక స్కోరు సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఆ రికార్డును బ్రేక్ చేస్తానని పద్నాలుగేళ్ల కుర్రాడు చెప్పడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
మాటలు కాదు.. చేతల్లోనూ విధ్వంసమే!
వైభవ్ చెబుతున్న మాటలు కేవలం అతిశయోక్తి కాదని అతని గత గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొన్నటి 2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వైభవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ చారిత్రక ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం విశేషం. అతని అద్భుత బ్యాటింగ్‌తోనే భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ఛాంపియన్‌గా నిలిచింది.
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీల మోత
ఇక వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఐపీఎల్‌లో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ, కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని, ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ (30 బంతులు) తర్వాత అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన రెండో ఆటగాడిగా, అలాగే ఒక భారతీయుడిగా ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు.
ఇంత చిన్న వయసులోనే దిగ్గజాల రికార్డులపై కన్నేసిన వైభవ్.. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

