Yash Dayal Marriage: పోక్సో కేసుల వివాదాల నడుమ ఆర్సీబీ స్టార్ సీక్రెట్ పెళ్లి.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వధువు బ్యాక్‌గ్రౌండ్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ యశ్ దయాల్ మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచాడు. ఒకవైపు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టినప్పటికీ, గుట్టుచప్పుడు కాకుండా అతడు సీక్రెట్‌గా వివాహం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఫిబ్రవరి 4వ తేదీన నోయిడాలో జరిగిన ఓ అత్యంత ప్రైవేట్ వేడుకలో శ్వేత పుండిర్‌ను యశ్ దయాల్ పెళ్లాడాడు. ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పెళ్లి వేడుకకు టీమిండియా నుంచి కానీ, ఆర్సీబీ ప్లేయర్స్ నుంచి కానీ ఎవరూ హాజరుకాలేదు.
గత ఏడాది కాలంగా యశ్ దయాల్‌పై నమోదైన రెండు తీవ్రమైన లైంగిక వేధింపుల కేసులు అతని ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి. యశ్ మాజీ ప్రేయసి ఒక కేసు నమోదు చేయగా, ఒక మైనర్‌కు సంబంధించిన ఆరోపణలపై ఏకంగా పోక్సో చట్టం కింద మరో కేసు నమోదైంది. ఈ కేసులో అతనిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది.
అయితే, రాజస్థాన్ హైకోర్టు ఆ వారెంట్‌పై స్టే ఇవ్వడంతో యశ్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈ కేసులు ఇంకా కోర్టు విచారణ దశలో ఉండగానే, ఈ న్యాయపరమైన చిక్కుల మధ్య అతను పెళ్లి పీటలెక్కడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అసలు అన్ని వివాదాలు ఉన్న ఈ క్రికెటర్‌ను పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరా అని నెటిజన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు.
యశ్ దయాల్‌ను పెళ్లాడిన శ్వేత పుండిర్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. అయితే ప్రస్తుతం ఆమె ఢిల్లీలో నివసిస్తున్నారు. శ్వేత కేవలం సాధారణ యువతి కాదు, ఆమె ఒక పాపులర్ కంటెంట్ క్రియేటర్ మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. బ్రాడ్‌కాస్టర్‌గా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 5.87 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, యూట్యూబ్‌లో యాభై వేలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇంటర్ కాంటినెంటల్ లెజెండ్స్ లీగ్‌లో బ్రాడ్‌కాస్టర్‌గా కూడా పని చేసిన అనుభవం శ్వేత సొంతం. అయితే, వేర్వేరు రంగాలకు చెందిన వీరిద్దరికి అసలు ఎపుడు, ఎలా పరిచయం ఏర్పడిందనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
ఇక యశ్ దయాల్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో యశ్ దయాల్ పాత్ర ఎంతో కీలకం. ఆ సీజన్‌లో బెంగళూరు తరఫున 13 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఓవరాల్‌గా 43 ఐపీఎల్ మ్యాచ్‌లలో 41 వికెట్లు పడగొట్టిన అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 3/20. త్వరలో జరగబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా అతను బరిలోకి దిగే అవకాశముంది. ఇన్ని వివాదాల మధ్య అతని క్రికెట్ కెరీర్, వైవాహిక జీవితం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.

