ఇరాన్ గుండెల్లో వణుకు.. గల్ఫ్‌లో మోహరిస్తున్న అమెరికా డెత్ స్క్వాడ్! మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైందా?
పశ్చిమాసియాలో నెత్తురు మరుగుతోంది. ఆకాశం నుంచి నిప్పుల వాన కురవడానికి బహుశా ఎంతో సమయం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎక్కడో గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత మోగితే మనకేంటి అనుకోకండి. ప్రపంచ చమురు మార్కెట్లను శాసించే ఆ మహా సంగ్రామం మన పెట్రోల్ బంకుల మీదా, వంటింటి బడ్జెట్ మీదా కూడా అంతే స్థాయిలో పేలబోతోంది. పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే.. అగ్రరాజ్యం అమెరికా తన చేతిలో ఉన్న అత్యంత భయంకరమైన బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు రంగంలోకి దించింది. అసలు ఆ 'డెత్ స్క్వాడ్' కథేంటి? గల్ఫ్ తీరంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది?
18 గంటల టైమ్.. ఎక్కడైనా, ఎప్పుడైనా మృత్యుఘోషే!
ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి అమెరికా తన అత్యంత శక్తివంతమైన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన 3 వేల మంది ఎలైట్ (కమాండో) సైనికులను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఇప్పటికే ఇరాన్ చుట్టుపక్కల మెరైన్ బలగాలను వేల సంఖ్యలో మోహరించిన అగ్రరాజ్యం, ఇప్పుడు ఈ డెత్ స్క్వాడ్‌ను కూడా దించడంతో గల్ఫ్ తీరంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం పతాక స్థాయికి చేరింది.
ఈ 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ మామూలు సైన్యం కాదు. ప్రపంచ పటంలో ఏ మూలనైనా సరే.. కేవలం 18 గంటల వ్యవధిలో వాలిపోయి, శత్రువుల కోటల్లోకి పారాచూట్ల ద్వారా దూకి విధ్వంసం సృష్టించడంలో వీరు దిట్టలు. భూతల దాడులకు సంబంధించి పెంటగాన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నప్పటికీ, ఏ క్షణమైనా నరకం చూపించడానికి ఈ సైన్యం గన్‌కు గురిపెట్టి సిద్ధంగా ఉంది.
ఖర్గ్ ఐలాండ్ టార్గెట్.. ఇరాన్ నడ్డి విరిచే ప్లాన్!
అమెరికా మీడియా కథనాల ప్రకారం ఈ కమాండోల టార్గెట్ ఒక్కటే.. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికో లేదా ఆ దేశ వ్యూహాత్మక తీర ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తీసుకోవడానికో ఈ దళాలను వాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిని వెంటనే తెరిచి, చమురు రవాణాను పునరుద్ధరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఆ డెడ్‌లైన్‌లోపు ఇరాన్ దారికి రాకపోతే, బలప్రయోగం ద్వారా ఆ మార్గాన్ని క్లియర్ చేయడానికి ఈ ఎలైట్ సైన్యాన్నే ఉపయోగించనున్నారు. అంతేకాదు, ఇరాన్ వద్ద ఉన్న ప్రమాదకరమైన యురేనియం నిల్వలను కూడా వీరే తమ అధీనంలోకి తీసుకునే వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం.
కత్తి చూపిస్తూ.. శాంతి మంత్రం: ట్రంప్ మైండ్ గేమ్
ఒక చేత్తో 3 వేల మంది కమాండోలను దించుతూనే, మరో చేత్తో ట్రంప్ శాంతి వచనాలు పలుకుతున్నారు. "ఇరాన్ ఒప్పందం కోసం చాలా ఆతృతగా ఉంది. ప్రస్తుతం తెరవెనుక చర్చలు నడుస్తున్నాయి" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మహా వివాదంలో దాయాది దేశం పాకిస్థాన్ మధ్యవర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే, దౌత్య మార్గాల ద్వారా శాంతి కోసం ప్రయత్నిస్తూనే.. మరోవైపు సైనిక మోహరింపును ఏమాత్రం ఆపే ప్రసక్తే లేదని వైట్ హౌస్ ఖరాఖండీగా తేల్చిచెప్పింది.
గల్ఫ్ టెన్షన్.. సామాన్యుడికి శాపమేనా?
3 వేల మంది ఎలైట్ కమాండోలు గల్ఫ్‌లో అడుగుపెట్టడం అంటే అది కచ్చితంగా సాధారణ పరిణామం కాదు. చర్చల పేరుతో ఇరాన్‌ను బుజ్జగిస్తున్నట్లు నటిస్తూనే, అగ్రరాజ్యం తన ఉక్కుపాదం మోపడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు భూతల యుద్ధానికి దారితీస్తే.. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా ఆగిపోయి, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఒక సామాన్యుడిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే.. గల్ఫ్ ప్రాంతంలో రాలుతున్న ప్రతి బాంబు, రేపు మన జేబులో పడే చిల్లుకు సంకేతమే. మూడో ప్రపంచ యుద్ధం ఛాయలు కమ్ముకుంటున్న ఈ వేళ, మున్ముందు ఈ నాటకం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!
Also Read:
20 నిమిషాల్లో 840 కోట్లు.. ట్రంప్ ప్రకటనకు ముందే ట్రేడింగ్ స్కామ్!US Iran War | దాడులకు బ్రేక్.. తెరవెనుక ఇరాన్, అమెరికా మైండ్ గేమ్!
రాత్రి పూట కూడా సోలార్ విద్యుత్: చైనా శాస్త్రవేత్తల అద్భుతం
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2025: భారత్, పాకిస్థాన్, చైనాలకు వార్నింగ్
ట్రంప్ సరికొత్త డ్రామా.. ఇరాన్ యుద్ధం నా ఐడియా కాదు!

