ప్రాణం పోయే పరిస్థితి వస్తే.. సామాన్యుడికి గుర్తొచ్చేది కార్పొరేట్ ఆస్పత్రి. ఆ గడప తొక్కితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్న భయం ఒకవైపు.. ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆరాటం మరోవైపు! దశాబ్దాలుగా మనల్ని పట్టి పీడిస్తున్న ఈ భయానికి ఇక శాశ్వత ముగింపు పలకబోతోంది. సామాన్యులకే కాదు.. ఏకంగా విదేశీయులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ ఖర్చుతోనే, అతి తక్కువ ధరకే అందించే ఒక మహా వైద్య విప్లవం హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతం కాబోతోంది. ఇది కేవలం ఆస్పత్రుల నిర్మాణం కాదు.. ప్రాణాలకు వెలకట్టే ప్రైవేట్ దందాకు చెక్ పెడుతూ.. తెలంగాణ వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్న మహా ఘట్టం!
జూన్ 2న సరికొత్త వైద్య శకం.. ప్రారంభానికి సిద్ధమైన 'టిమ్స్'!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (టిమ్స్) ఆస్పత్రులు ఇప్పుడు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగర నలుమూలలా అల్వాల్, సనత్ నగర్, కొత్తపేట (ఎల్బీ నగర్) ప్రాంతాల్లో ఈ మూడు భారీ ఆస్పత్రులకు శంకుస్థాపనలు జరిగాయి. ఇప్పుడు ఆ మహా నిర్మాణాలు పూర్తయ్యి, తుది మెరుగులు అద్దుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్.. రాబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన సనత్ నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను అట్టహాసంగా ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ కల్పించిన అత్యాధునిక వైద్య సౌకర్యాలు చూస్తే ఎవరైనా సరే ఇది ప్రభుత్వ ఆస్పత్రా లేక ఫైవ్ స్టార్ కార్పొరేట్ ఆస్పత్రా అని భ్రమపడాల్సిందే!
విదేశీయుల కోసం 'జి టూ జి'.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే గ్లోబల్ ట్రీట్‌మెంట్!
ఇప్పటికే మన భాగ్యనగరం గ్లోబల్ 'మెడికల్ టూరిజం' హబ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత శిఖరానికి చేర్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. త్వరలో ఓపెన్ కానున్న ఈ టిమ్స్ ఆస్పత్రుల్లో విదేశాల నుంచి వచ్చి చికిత్స తీసుకునే రోగులకు సైతం అత్యుత్తమ వైద్యం అందించాలని ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
కొత్తగా నిర్మిస్తున్న సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆస్పత్రుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక 'ఇంటర్నేషనల్ పేషెంట్ వింగ్'లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. మెడికల్ టూరిజాన్ని బలోపేతం చేయడంలో భాగంగా.. ఒక్కో టిమ్స్ ఆస్పత్రిలో విదేశీయుల కోసం ప్రత్యేకంగా 50 బెడ్ల చొప్పున.. మొత్తంగా 150 పడకలను కేవలం ఫారిన్ పేషెంట్ల కోసమే కేటాయించనున్నారు.
విదేశాల నుంచి నేరుగా రోగులను రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం విదేశీ ప్రభుత్వాలతో 'గవర్నమెంట్ టు గవర్నమెంట్' (జీ టు జీ) పద్ధతిలో నేరుగా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోనుంది. మరీ ముఖ్యంగా ఆఫ్రికా, అరబ్ దేశాల నుంచి ఎంతోమంది రోగులు ప్రతిరోజూ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. ఆయా దేశాలతో నేరుగా ఎంఓయూలు చేసుకోవడం ద్వారా ఆ విదేశీ పేషంట్లను టిమ్స్ ఆస్పత్రులకు రప్పించేలా సర్కార్ పక్కా ప్రణాళికలు రచిస్తోంది.
ప్రైవేట్ దందాకు బ్రేక్.. అతి క్లిష్టమైన ఆపరేషన్లు కూడా ఇక్కడే!
ప్రస్తుతం వివిధ దేశాల నుంచి చికిత్స కోసం వస్తున్న విదేశీయులు గానీ, ఇక్కడ అత్యవసర వైద్యం అవసరమైన వారు గానీ హైదరాబాద్‌లోని బడా కార్పొరేట్ ఆస్పత్రులకే క్యూ కడుతున్నారు. అక్కడ ట్రీట్‌మెంట్ కోసం కళ్లు చెదిరే స్థాయిలో భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ దందాకు అడ్డుకట్ట వేస్తూ.. కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోకుండా, అతి తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం దృఢ లక్ష్యంగా పెట్టుకుంది.
సాధారణ జ్వరాలు, నొప్పులే కాదు.. అత్యంత ఖరీదైన, క్లిష్టమైన అవయవాల మార్పిడి (ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్), ప్రాణాలు నిలిపే గుండె ఆపరేషన్లు, కబళించే క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలకు కూడా ఇకపై ఈ టిమ్స్ ఆస్పత్రుల్లోనే అంతర్జాతీయ స్థాయి చికిత్సను అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటిదాకా కేవలం ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన విదేశీ వైద్య సేవలు.. ఇక నుంచి ప్రభుత్వ పరిధిలోకి కూడా రానున్నాయి.
ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే ముక్కుమూసుకుని వెళ్లే పరిస్థితి. కానీ, రేపు విదేశీయులు సైతం మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ కోసం క్యూ కట్టే రోజులు రావడం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం! ఈ 'టిమ్స్' ఆస్పత్రులు కేవలం కాంక్రీట్ భవనాలు కావు.. సామాన్యుడి ఆరోగ్యానికి కొండంత భరోసా ఇచ్చే నూతన దేవాలయాలు. ఈ ఆస్పత్రులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, కార్పొరేట్ ఆస్పత్రుల మెడికల్ మాఫియా బద్దలవడం, సామాన్యుడి ప్రాణభయం తీరడం పక్కా. మెడికల్ టూరిజంలో భాగ్యనగరం ప్రపంచపటంపై చెరగని ముద్ర వేయబోతోంది!
Also Read:
State Trauma Care Policy: తెలంగాణలో ప్రాణదాత పథకంLiquor Price Hike: తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు
Hyderabad Land Scam: పేదోళ్ల ఇళ్లే కూలుస్తారా? పెద్దోళ్ల కబ్జాలు కనపడవా? హైడ్రాపై హరీష్ రావు ఫైర్!
Basara Temple Master Plan: బాసరకు రూ.225 కోట్లతో మహర్దశ!
Cyber Crime Hyderabad: టెకీకి 2.36 కోట్ల కుచ్చుటోపీ

