ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా అధికంగా పెరుగుతున్న రక్తపోటు సమస్యపై అపోలో ఆసుపత్రులు ప్రత్యేక దృష్టి సారించాయి. భారతదేశంలో సుమారు 30 శాతం మంది వయోజనులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఇది గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు మరియు అకాల మరణాలకు ప్రధాన కారణంగా మారుతోందని వారు పేర్కొన్నారు.
30 కోట్ల మందికి రక్తపోటు.. సగం మందికి తెలియదు!
భారతదేశంలో 30 కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నా, వారిలో సగం మందికి కూడా ఈ పరిస్థితి గురించి అవగాహన లేదని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా యువతలో ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. 2024లో 45 ఏళ్లలోపు వయస్సు గల వారిలో 26 శాతం మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
అపోలో ఆసుపత్రుల ముందుజాగ్రత్త చర్యలు
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మాట్లాడుతూ, “వ్యాధి రాకముందే జాగ్రత్తలు తీసుకోవడమే అపోలో ధ్యేయం. ‘అపోలో ప్రోహెల్త్’ వంటి కార్యక్రమాల ద్వారా 2.5 కోట్ల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాం. ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని తెలిపారు.
పట్టణాల్లో విస్తరిస్తున్న ప్రమాదం
హైదరాబాద్ (68%), ఢిల్లీ (65%), చెన్నై (63%) వంటి పెద్ద నగరాల్లో అధిక రక్తపోటు కేసులు నమోదు అవుతున్నాయి. జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లోపం వంటి అంశాలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు.
యువతలో నిశ్శబ్ద వ్యాధిగా మారిన రక్తపోటు
అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతా రెడ్డి మాట్లాడుతూ, “రక్తపోటు వయస్సుతో సంబంధం లేకుండా యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం కొలతలకే పరిమితం కాకుండా, శరీరంలోని అన్ని ఆరోగ్య సూచికలపై సమగ్ర అవగాహన అవసరం,” అని హెచ్చరించారు.
జీవనశైలిలో మార్పుతోనే నివారణ
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారంలో ఉప్పు తగ్గించడం, క్రమంగా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించడం వంటివి పాటిస్తే దాదాపు 80 శాతం గుండెపోటులు, పక్షవాతాలు నివారించవచ్చని వారు పేర్కొన్నారు.