ఉగ్ర ముఠాలకు అండగా నిలుస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ 'ఆపరేషన్ సింధూర్' ద్వారా గట్టిగా బుద్ధి చెప్పింది. శత్రుదేశాన్ని అన్నివిధాలుగా దెబ్బతీసిన న్యూఢిల్లీ, ఇప్పుడు దాయాది పాకిస్తాన్‌పై ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే నేడు పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది.
పలు దేశాల డిఫెన్స్ అధికారులు, రాయబారులతో కీలక భేటీ
భారతదేశంలో ఉన్న యూకేతో సహా పలు దేశాల డిఫెన్స్ అధికారులు మరియు రాయబారులకు కేంద్రం ఇప్పటికే సమన్లు పంపించింది. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని రక్షణశాఖ కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో 'ఆపరేషన్ సింధూర్'కు సంబంధించిన ముఖ్య వివరాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకోనుంది. ఉగ్రవాద నిర్మూలనలో భారత్ వేసిన ముందడుగు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాల వివరాలను వారికి అందించనున్నట్లు సమాచారం.
పాక్‌పై సైనిక చర్యకు కారణాలు, మద్దతు కోరనున్న భారత్
పాకిస్తాన్‌పై మిలిటరీ చర్యకు గల కారణాలను వివరించి, మద్దతు కొనసాగించాలని ఆ దేశాలను కేంద్రం కోరనున్నట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం జరిగే భేటీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, పలువురు ఉన్నతాధికారులు మరియు రక్షణశాఖ అధికారులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం
ఇక, బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతాపరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంటరీ స్థాయి సంఘానికి వివరాలు
మరోవైపు విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులతోనూ 'ఆపరేషన్ సింధూర్' వివరాలను కేంద్రం పంచుకోనుంది. మే 19వ తేదీన పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇందులో విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, 'సింధూర్' వివరాలను సభ్యులకు వెల్లడించనున్నారు.

