జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదు: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన

 


తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్‌ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పష్టం చేసింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో, శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.

థియేటర్ల బంద్‌పై స్పష్టత

ఈ సమావేశం అనంతరం ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. "థియేటర్ల బంద్‌ అనేది తప్పుగా చిత్రీకరించారు. చర్చలు జరగకపోతే, జూన్‌ 1వ తేదీ నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నది మాత్రమే నిజం. కానీ, అందరూ థియేటర్లు మూసి వేస్తారన్న సమాచారాన్నే ప్రచారం చేశారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్‌లను బంద్‌ చేస్తున్నామనడం సరికాదు. కొన్ని వార్తలు బిజినెస్‌ను దెబ్బతీస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో వంద సమస్యలు ఉన్నాయని, అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్‌ అయి ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ రావాలని దామోదర ప్రసాద్‌ అన్నారు.

పర్సంటేజీ విధానం, భవిష్యత్ ప్రణాళిక

థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని దామోదర ప్రసాద్ తెలిపారు. తదుపరి రోడ్‌ మ్యాప్‌ ఏంటనేది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. మూడు రంగాల నుంచి (నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు) ఒక కమిటీని వేస్తున్నామని, నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చారు. ఈనెల మే 30న జరిగే సమావేశంలో కమిటీ సభ్యులను నిర్ణయిస్తామని ఆయన వెల్లడించారు.

అధికారిక సమాచారంపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి

"థియేటర్ల బంద్‌ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, దాని ప్రతినిధుల నుంచి వచ్చే సమాచారమే ఫైనల్. దానికి మేము సమాధానాలు చెబుతాం. ఎవరెవరి దగ్గరి నుంచో మీడియా అభిప్రాయాలు తీసుకుని ఎవరి వెర్షన్‌ వారు రాసుకుని వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రాయడం సరికాదు" అని దామోదర ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు.

చిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాలను త్వరలోనే కలుస్తామని, వీలైనన్ని సమస్యలను తమలో తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. మిగిలిన వాటి విషయంలో ప్రభుత్వంతోనూ చర్చిస్తామని, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసి ఇండస్ట్రీలోని సమస్యలను వివరిస్తామని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌ తెలిపారు.