వేసవిలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు!

raw onion health benefits in summer

చాలామంది పచ్చి ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుందని దానిని తినడానికి ఇష్టపడరు. కానీ ఆరోగ్య నిపుణులు రోజుకో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు అస్సలు వదలరని అంటున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. వేడి ఎక్కువగా ఉండే ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి మరియు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి ఉల్లిపాయ ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది

పచ్చి ఉల్లిపాయల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీరం ఎక్కువసేపు హైడ్రేట్‌గా మరియు చల్లగా ఉంటుంది. అంతేకాకుండా, ఉల్లిపాయలో పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది శరీరంలోని ద్రవాలను నియంత్రిస్తుంది. వేసవిలో చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను కూడా పచ్చి ఉల్లిపాయ తినడం ద్వారా తిరిగి పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

సాధారణంగా ఉల్లిపాయల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మరియు ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయ తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంటుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు మరియు ఎక్కువగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు గుండె జబ్బులు, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

శరీరాన్ని చల్లబరుస్తుంది

ఉల్లిపాయల్లో శరీరాన్ని చల్లబరిచే ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి మరియు వేడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. పచ్చి ఉల్లిపాయలను లేదా కొద్దిగా ఉడికించి తిన్నప్పుడు అవి సల్ఫర్ మరియు క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఈ సమ్మేళనాలు శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. వేసవిలో వచ్చే శరీర వేడి మరియు సన్ స్ట్రోక్ ప్రభావం కూడా తగ్గుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఎండాకాలంలో చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. తిన్నది సరిగ్గా అరగకపోవడం మరియు ఆకలి తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఉల్లిపాయ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే డైటరీ ఫైబర్, ప్రిబయోటిక్స్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

చర్మం మరియు జుట్టుకు మేలు చేస్తుంది

ఫైబర్ అధికంగా ఉండే ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం మరియు గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల ఎండాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అంతేకాకుండా, ఉల్లిపాయలు తినడం వల్ల జుట్టు మరియు చర్మానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వేడి వల్ల వచ్చే మొటిమలు మరియు మచ్చల సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రెగ్యులర్‌గా ఉల్లిపాయలు తినడం వల్ల వేసవి వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయలు శరీరాన్ని చల్లబరుస్తాయి మరియు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. అయితే, వాటిని మరీ ఎక్కువగా తినకూడదు. మోతాదు పరిమాణంలో తినడం మంచిదని గుర్తుంచుకోవాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు