జూన్ 23న జర్మనీ స్టార్టప్ కంపెనీ ది ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ ప్రయోగించిన ఎన్‌వైఎక్స్ (NYX) అనే స్పేస్ క్యాప్సూల్ క్రాష్ అయ్యింది. "మిషన్ పాజిబుల్"లో భాగంగా నింగిలోకి పంపిన ఈ క్యాప్సూల్, 166 మందికి చెందిన అస్థికలతో పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. టెక్సాస్‌కు చెందిన సెలెస్టిస్ అనే కంపెనీ మానవ అస్థికలను భూకక్ష్యలోకి పంపే ప్రాజెక్టును చేపడుతోంది.
ప్రయోగంపై కంపెనీల ప్రకటనలు
ఈ ప్రయోగంపై సెలెస్టిస్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ పేలోడ్‌లు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించాయని, లాంచర్ నుండి విడిపోయిన తర్వాత భూకక్ష్యలోకి తిరిగి ప్రవేశించాయని పేర్కొంది. అయితే, ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పిందని, తిరుగు ప్రయాణ సమయంలో సంకేతాలు తెగిపోయాయని కంపెనీ వెల్లడించింది. ఈ సమస్యకు గల కారణాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
వాండన్‌బర్గ్ స్పేస్ బేస్ నుండి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ క్యాప్సూల్‌ను పంపారు. క్యాప్సూల్‌లోని పేలోడ్‌లో అస్థికలతో పాటు 166 మందికి చెందిన డీఎన్‌ఏ నమూనాలు కూడా ఉన్నాయి. జూన్ 24న ల్యాండింగ్ సమయంలో క్యాప్సూల్‌లోని పారాచూట్‌లు విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో అది పసిఫిక్ సముద్రంలో కూలిపోయింది.
ది ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ కూడా లింక్‌డిన్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైందని పేర్కొంది. ఈ క్యాప్సూల్‌లో కస్టమర్లకు చెందిన సుమారు 300 కేజీల పేలోడ్ ఉందని తెలిపింది.
ఇది రెండో ఘటన
సెలెస్టిస్ కంపెనీకి చెందిన పేలోడ్ కార్గో పేలిపోవడం ఇది రెండోసారి. గతంలో 2023లో నాసా వ్యోమగామి ఫిలిప్ కే చాప్‌మన్ అస్థికలను తీసుకెళ్తున్న రాకెట్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అస్థికలను కోల్పోయిన కుటుంబ సభ్యులకు సెలెస్టిస్ కంపెనీ సంతాపం తెలియజేసింది.

