పరిశ్రమలకు అనుమతులు కేవలం 3 రోజుల్లోనే! చంద్రబాబు సర్కార్ పెట్టిన ఈ నయా టార్గెట్ చూస్తే షాక్ అవుతారు.. ప్లాస్టిక్‌పై యుద్ధం మామూలుగా లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సమూలంగా నిర్మూలించేందుకు ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో, రాష్ట్రాన్ని 'జీరో పొల్యూషన్' (Zero Pollution) స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు.
మొదట వార్నింగ్.. ఆ తర్వాతే యాక్షన్!
నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యల విషయంలో సీఎం ఆసక్తికర సూచనలు చేశారు. కాలుష్యం చేస్తున్న సంస్థలు లేదా వ్యక్తులపై వెంటనే కొరడా ఝుళిపించకుండా, మొదట హెచ్చరికలు జారీ చేయాలన్నారు. అప్పటికీ మార్పు రాకపోతేనే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, బయో వ్యర్థాల నిర్వహణలో మాత్రం అలసత్వం వద్దని, గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు హై-ఎండ్ టెక్నాలజీని వాడాలని సూచించారు.
అనుమతులు మెరుపు వేగంతో..
పరిశ్రమల స్థాపనను సులభతరం చేసేందుకు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కింద సీఎం విప్లవాత్మక డెడ్‌లైన్లను విధించారు. ఇకపై పరిశ్రమలకు అనుమతులు ఇలా జారీ కావాలి:
గ్రీన్ జోన్: దరఖాస్తు చేసిన కేవలం 3 రోజుల్లోనే అనుమతి ఇవ్వాలి.
ఆరెంజ్ జోన్: గరిష్టంగా 10 రోజుల్లో క్లియరెన్స్ రావాలి.
రెడ్ జోన్: ఎట్టి పరిస్థితుల్లోనూ 12 రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలి.
రైతులు పంట పొలాల్లో ప్లాస్టిక్ షీట్లకు బదులుగా, పర్యావరణానికి మేలు చేసే 'బయోషీట్ల'ను వాడేలా ప్రోత్సహించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరత ఉందని చైర్మన్ తెలపడంతో, నియామకాలకు సీఎం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలను (STP) వెంటనే వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు.

