అమెరికాలో H-1B వీసా వచ్చిందని సంబరపడిపోతున్నారా? ఒక్కసారి జాబ్ పోతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించారా.. దేశం విడిచి వెళ్లకుండా ఉండాలంటే ఈ 'ప్లాన్-బి' తప్పనిసరి!
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు H-1B వీసా ఒక వరం లాంటిదే. కానీ, ఇది దొరికితే ఇక జీవితం సెటిల్ అయిపోయినట్లే అని భావించడం పెద్ద పొరపాటు. ఈ వీసా మీకు శాశ్వత భరోసా ఇవ్వదని, ఏ క్షణానైనా ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి విపత్కర పరిస్థితి వస్తే, పెట్టాబేడా సర్దుకుని దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ముందుగానే ఒక ప్రత్యామ్నాయం (Plan-B) సిద్ధంగా ఉంచుకోవడం తెలివైన పని.
జాబ్ పోతే.. ఈ 3 మార్గాలు ఉన్నాయి!
ఒకవేళ దురదృష్టవశాత్తు H-1B వీసాపై ఉన్న ఉద్యోగం పోతే, కంగారు పడకుండా వెంటనే ఈ క్రింది మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు:
B-2 (టూరిస్ట్) వీసా: దీనికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా అమెరికాలో మరికొంత కాలం చట్టబద్ధంగా ఉండేందుకు అనుమతి లభిస్తుంది. ఈ గ్యాప్‌లో మీరు మరో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు.
F-1 (స్టూడెంట్) వీసా: ఏదైనా కొత్త కోర్సు లేదా ప్రోగ్రాంలో చేరడం ద్వారా ఈ వీసాకు మారొచ్చు. ఇది మీరు దేశంలో ఎక్కువ కాలం ఉండేందుకు ఒక సేఫ్ ఆప్షన్.
H-4 (డిపెండెంట్) వీసా: వివాహితులకు ఇది బెస్ట్ ఆప్షన్. భార్యాభర్తల్లో ఒకరికి H-1B ఉంటే, ఉద్యోగం కోల్పోయిన వారు వెంటనే H-4 వీసాకు మారవచ్చు.
ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఆకస్మికంగా అమెరికాను విడిచి వెళ్లాల్సిన పరిస్థితిని అధిగమించి, నిలదొక్కుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది.

