జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా మారింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, ప్రచారానికి కేవలం నాలుగు రోజులే మిగిలివుంది. దీంతో ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రచారంతో ఊర్రూతలూగిస్తున్నారు. ఈ విషయంలో కాస్త వెనుకబడినట్లు కనిపించిన బీజేపీ, ఇప్పుడు ఓ మాస్టర్ స్కెచ్ వేసింది.
బీజేపీ అస్త్రం: రంగంలోకి పవన్ కల్యాణ్!
తమ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా ఎన్డీఏ భాగస్వామి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రచార బరిలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేసింది.
జూబ్లీహిల్స్‌లో పవన్‌తో ఒక రోజు ప్రచారం చేయించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు.. జనసేన పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఆ 30 వేల ఓట్ల కోసమేనా ఈ వ్యూహం?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్లతో పాటు, సినీ కార్మికుల ఓట్లు అత్యంత కీలకంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 30 వేల మంది సినీ కార్మికుల ఓట్లు ఉన్నాయని అంచనా.
నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఓట్లు ఉన్నా, గత నాలుగు ఎన్నికల్లో సగటున 50 శాతానికి మించి ఓటింగ్ జరగలేదు. ఈసారి కూడా 50 నుంచి 60 శాతం పోలింగ్ జరిగితే, ఈ 30 వేల ఓట్లు గెలుపోటములను శాసిస్తాయి.
పవన్ కల్యాణ్ ప్రచారం ద్వారా సినీ కార్మికులతో పాటు, ఆంధ్రా సెటిలర్లు, కాపు సామాజికవర్గం ఓట్లను ఆకట్టుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.
రేవంత్ రెడ్డి కౌంటర్ స్ట్రాటజీ.. టీడీపీ ఓట్లు ఎటు?
ఈ ఉప ఎన్నికలో టీడీపీ ఓటు బ్యాంకు కూడా కీలకంగా మారింది. ఎన్డీఏలో భాగస్వామి అయినా, తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను బీజేపీ ప్రచారానికి తీసుకురాలేకపోతోంది.
టీడీపీ తటస్థ వైఖరి
దీనికి తోడు, జూబ్లీహిల్స్‌లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, కార్యకర్తలు తమ మనోభీష్టానికి తగినట్లు నడుచుకోవాలని టీడీపీ ప్రకటించింది. దీంతో ఈ ఓట్లు ఎటువైపు మొగ్గు చూపుతాయనేది ఉత్కంఠ రేపుతోంది.
రేవంత్ 'వ్యూహాత్మక' ప్రచారం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టీడీపీ సానుకూల ఓట్లతో పాటు, సినీ కార్మికుల ఓట్లకు గాలం వేస్తున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్‌కు సినీ రంగంలో పలువురితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే హీరో సుమన్ కూడా నవీన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు.
అంతేకాకుండా, అమీర్‌పేట మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని సీఎం రేవంత్ ప్రకటించడం.. టీడీపీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగానే విశ్లేషకులు చూస్తున్నారు.
పవన్ రోడ్ షో.. త్వరలో షెడ్యూల్!
రేవంత్ రెడ్డి ఎత్తుగడలకు ప్రతివ్యూహంగానే బీజేపీ పవన్‌ను రంగంలోకి దింపుతోందని అంటున్నారు. 2023 ఎన్నికల్లో కూడా పవన్ బీజేపీ-జనసేన కూటమి తరఫున నగరంలో ప్రచారం చేశారు.
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే పవన్ టూర్ షెడ్యూల్, రోడ్ షో వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
ప్రచారానికి కొద్ది రోజులే సమయం ఉన్న వేళ పవన్ కల్యాణ్ రాక ఖరారైతే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరింత రసకందాయంలో పడటం ఖాయం.
