నవంబర్ 30 వచ్చేస్తోంది.. ఈ 4 రోజుల్లో ఆ పనులు పూర్తి చేయకపోతే భారీ జరిమానాలు తప్పవు! మీ పెన్షన్, బ్యాంక్ ఖాతా సేఫ్‌గా ఉండాలంటే ఈ డెడ్‌లైన్స్ మిస్ అవ్వకండి.
మరికొన్ని రోజుల్లో నవంబర్ నెల ముగిసిపోనుంది. ప్రతినెలా లాగే ఈ నెలాఖరుకు కూడా కొన్ని కీలకమైన ఆర్థికపరమైన గడువులు ముగుస్తున్నాయి. నవంబర్ 30వ తేదీ లోపు కొన్ని డాక్యుమెంటేషన్, ఫైనాన్షియల్ పనులు పూర్తి చేయకపోతే జేబుకు చిల్లు పడటం ఖాయం. కేవలం ఆర్థిక నష్టాలే కాదు, మీ పనులకు అంతరాయం కలిగే ప్రమాదం కూడా ఉంది.
ఐటీ రిటర్న్స్, టీడీఎస్ డెడ్‌లైన్
ఆదాయపు పన్నుకు సంబంధించి ఇది చాలా కీలకమైన సమయం. అక్టోబర్ నెలకు సంబంధించిన ట్యాక్స్ డిడక్షన్ (TDS), టీసీఎస్ (TCS) చలాన్ స్టేట్‌మెంట్‌లను సమర్పించడానికి నవంబర్ 30 ఆఖరి తేదీ. ముఖ్యంగా ఆస్తి అమ్మకాలు, అద్దెలు, కాంట్రాక్టర్ చెల్లింపులపై పన్ను మినహాయింపుదారులకు ఇది వర్తిస్తుంది. అలాగే, ట్రాన్స్‌ఫర్ ధరల ఆడిట్ పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ (ITR) దాఖలు చేయడానికి కూడా ఇదే చివరి గడువు.
ఈ 3 పనులు మర్చిపోవద్దు!
ఈ నెలాఖరు లోపు సామాన్యులు, ఉద్యోగులు, పెన్షనర్లు కచ్చితంగా పూర్తి చేయాల్సిన పనులు ఇవే:
PNB కస్టమర్లకు అలర్ట్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు తమ కేవైసీ (KYC)ని నవంబర్ 30లోపు అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం మీ ఖాతా లావాదేవీలు నిలిచిపోయే (Freeze) ప్రమాదం ఉంది.
పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్: పెన్షన్ ఆగకుండా రావాలంటే, పెన్షనర్లు అందరూ ఈ తేదీలోపు తమ వార్షిక 'జీవన్ ప్రమాణ్' (Life Certificate) పత్రాన్ని సమర్పించడం అత్యవసరం. దీనికోసం బ్యాంకుకు వెళ్లక్కర్లేదు, వీడియో కాల్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు.
NPS టు UPS: ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్ నుంచి కొత్తగా వచ్చిన యూపీఎస్ (UPS)కు మారడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా నవంబర్ 30తో ముగుస్తుంది. మెరుగైన లాభాల కోసం ఉద్యోగులు దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాబట్టి, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఈ పనులను వెంటనే చక్కబెట్టుకోవడం మంచిది. గడువు దాటితే పెన్షన్ ఆగిపోవడం, బ్యాంక్ లావాదేవీలు స్తంభించడం లేదా ఐటీ శాఖ నుంచి నోటీసులు, జరిమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

