విశాఖపట్నం దశ తిరగబోతోంది! గూగుల్ తర్వాత ఇప్పుడు రిలయన్స్ వంతు.. ఏకంగా రూ. 98 వేల కోట్ల పెట్టుబడితో సాగరనగరాన్ని 'డేటా క్యాపిటల్'గా మార్చేందుకు అంబానీ స్కెచ్ వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం హయాంలో పెట్టుబడుల వరద పారుతోంది. ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో రూ. 1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విదేశీ దిగ్గజం బాటలోనే, మన స్వదేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ (Reliance) కూడా విశాఖలోనే భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రూ. 98,000 కోట్లతో, 1 గిగా వాట్ (1 GW) సామర్థ్యం కలిగిన అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ఇండియా 'డేటా క్యాపిటల్'గా విశాఖ!
ఈ భారీ పెట్టుబడి విషయాన్ని ఐటీ మంత్రి నారా లోకేష్ అధికారికంగా వెల్లడించారు. గూగుల్, రిలయన్స్ వంటి దిగ్గజాల రాకతో విశాఖపట్నం దేశానికే 'డేటా రాజధాని' (Data Capital)గా మారబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ మెగా ప్రాజెక్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:
జాయింట్ వెంచర్: రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీలు కలిసి ఏర్పాటు చేసిన 'డిజిటల్ కనెక్షన్' (Digital Connexion) ద్వారా ఈ ప్రాజెక్ట్ రానుంది.
పెట్టుబడి: సుమారు 11 బిలియన్ డాలర్లు (రూ. 98,000 కోట్లు).
విస్తీర్ణం: 400 ఎకరాల్లో ఈ భారీ డేటా సెంటర్ పార్కులను అభివృద్ధి చేస్తారు.
లక్ష్యం: 2030 నాటికి పూర్తిస్థాయిలో ఏఐ (AI) అవసరాలకు తగ్గట్టుగా దీన్ని నిర్మిస్తారు.
ఏపీ ఇక 'ఏఐ' హబ్.. ఒప్పందం పూర్తి!
ఈ ప్రతిపాదిత పెట్టుబడిని అధికారికం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో అవగాహన ఒప్పందం (MoU) కూడా పూర్తయింది. ఈ కొత్త డేటా సెంటర్ పార్కులు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) కోసం పూర్తిగా ఆప్టిమైజ్ చేయబడతాయి. భవిష్యత్తులో వచ్చే భారీ ఏఐ పనిభారాన్ని తట్టుకునేలా, అధిక సాంద్రత గల రాక్‌లు, బలమైన పవర్ ఫీడ్‌లతో వీటిని డిజైన్ చేస్తున్నారు.
ఇప్పటికే చెన్నైలో ఒక క్యాంపస్ నిర్వహిస్తున్న డిజిటల్ కనెక్షన్, ఇప్పుడు విశాఖ విస్తరణతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే భారత్‌ను ఒక ప్రధాన ఏఐ కేంద్రంగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. రాబోయే దశాబ్దంలో ఏపీ డిజిటల్ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందనడానికి ఇదే నిదర్శనం.

