రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. "కొండంత రాగం తీసి.. చివరకు గాడిద పాడినట్టు ఉంది" అంటూ హనుమకొండ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచాయి.
హనుమకొండ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్, ఇప్పుడు వారినే నట్టేట ముంచుతోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని 'బీసీ ద్రోహి'గా అభివర్ణిస్తూ, పార్టీతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు.
కేసీఆర్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను వివరిస్తూ కేటీఆర్ తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు:
గుర్రం విలువ: "గాడిదలను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది" అంటూ, ప్రస్తుత ప్రభుత్వాన్ని చూశాకే ప్రజలకు బీఆర్ఎస్ పాలన విలువ తెలిసివస్తోందని సెటైర్ వేశారు.
అవినీతి అనకొండ: రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఒక 'అనకొండ'లా, చీడపురుగులా తయారయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ విజన్: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని, కానీ ఇప్పుడు అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దెబ్బకు ముఖ్యమంత్రిని గల్లీగల్లీ తిరిగేలా చేశామని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఓట్లు కొనుగోలు చేసి గెలిచిన ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు 'దీక్షా దివాస్' అవసరమని, ఓరుగల్లు గడ్డ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసలైన తిరుగుబాటు మొదలవుతుందని హెచ్చరించారు.

